CM Chandrababu: మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. కడప జిల్లాలోని మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మైదుకూరులో జరిగిన సభ సాక్షిగా వైయస్ జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.
మైదుకూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. తాను కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినేనని, తనకు రాయలసీమ సమస్యలపై పూర్తి అవగాహన ఉందంటూ చెప్పుకొచ్చారు. రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీసుకున్నారని, ఆ తర్వాత అదే పంథాను తాను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, రాష్ట్రంలో సాగు, త్రాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చారు. గాలేరు, నగరి, హంద్రీనీవాకు పునాదులు వేసింది ఎన్టీఆర్ అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ సహా మిగిలిన ఏ పార్టీలు కడపకు చేసిందేమీ లేదని, టీడీపీ హయాంలోని కడప జిల్లా అభివృద్ధి పథంలో నడిచిందంటూ చంద్రబాబు అన్నారు.
మాటలు చెప్పి ఎక్కడ ఒక తట్ట మట్టి కూడా పోయకుండా ఐదేళ్లు వైసీపీ పరిపాలన సాగిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లా క్లీన్ స్వీప్ కావాలంటూ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత స్పీడ్ పెంచాలని, మొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చరిత్రను తిరగ రాశాయని చంద్రబాబు అన్నారు.
Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. పూజ తర్వాత మొదలైన పనులు
నదుల అనుసంధానం కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అప్పుడే కరువు రహిత రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందుతుందన్నారు. ఎన్నికల అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా మైదుకూరుకు రావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా మైదుకూరుకు చేరుకున్నారు. అలాగే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి పలు హామీలను సైతం చంద్రబాబు సభ సాక్షిగా ప్రకటించారు.