Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన హఠాత్ పర్యటనలో.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బీసీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేస్తూ.. విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆమె ప్లేటులో బొద్దింక (cockroach) కనిపించింది. ఈ ఘటన అక్కడున్న అధికారులను, హాస్టల్ సిబ్బందిని షాక్‌కు గురి చేసింది.
ఘటన వివరాలు:
ఈ సంఘటన పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థినులతో నేరుగా మమేకమవుతూ వారి భోజన విధానాన్ని, ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి హోంమంత్రి స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వడ్డించిన భోజనంలో బొద్దింక (cockroach) కనిపించడంతో ఒక్కసారిగా అధికారుల ముఖాల్లో నిరాశ, భయాలు కనిపించాయి.
అధికారులపై అసహనం:
ఈ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు అందుతున్న ఆహార నాణ్యత ఈ స్థాయిలో ఉందంటే.. బాధ్యత ఉన్న అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ఆమె ప్రశ్నించారు. తన ప్లేట్‌లోనే ఇలా బొద్దింక వస్తే.. ఇక రోజు పెట్టే భోజనంతో పిల్లల పరిస్థితి ఏమిటని హాస్టల్ వార్డెన్‌పై మండిపడ్డారు. పిల్లలకు సన్న బియ్యంతో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా.. ఇలాంటి ఘటనలు జరగకూడదు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు విద్యార్థుల కోసం ఖర్చు చేస్తోంది. అయినా ఈ స్థాయిలో పిల్లలకు ఆహారం అందిస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులను వెంటనే విచారణ చేపట్టాలని చెప్పారు. హాస్టల్ సూపరింటెండెంట్‌ను, క్యాటరింగ్ సిబ్బందిని హెచ్చరించి, తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
విద్యార్థినుల ఫిర్యాదులు:
ఈ ఘటన అనంతరం విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చారు. వారు తరచూ తమకు వడ్డించే భోజనంలో బొద్దింకలు, చీమలు, పురుగులు, ఉంటున్నాయని, ఒక్కొక్కసారి మెత్తబడిన అన్నాన్ని పెడుతున్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థినులు అల్లర్జీలు, డైజెస్టివ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు హోంమంత్రికి వివరించారు.
రాష్ట్ర స్థాయిలో ప్రభావం:
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ హాస్టళ్ల పరిస్థితులపై దృష్టి వెళ్ళేలా చేసింది. ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా తీసుకుని, అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు జరిపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో ఆహార నాణ్యత, శుభ్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
Also Read: మళ్లీ పాదయాత్ర చేస్తా ఎప్పుడంటే..? జగన్ సంచలనం
పేద విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లలో.. ఈ రకమైన అనేక లోపాలు వెలుగులోకి రావడం దురదృష్టకరం. హోంమంత్రి అనితకి ఎదురైన ఈ అనుభవం, ప్రభుత్వ హాస్టళ్లలో తక్షణ మార్పులకు దారి తీయాలని ప్రజలు ఆశిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు అనేది సరైన పాలనతోనే మెరుగవుతుంది. దీని పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన సమయం ఇది.