Pawan Kalyan: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే.. ఏపీ పరిస్థితి దారుణంగా ఉండేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిరుద్యోగుల కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘2014 నుంచి రాష్ట్ర అభివృద్ధి కోరకుంటూ ఉన్నాం. 2019 నుంచి 24 మధ్య అభివృద్ది నుంచి విధ్వంసం వైపు పాలన సాగింది. సగటు మనిషి నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టారు. మాట్లాడాలన్నా భయపడే వికృతి పరిస్థితి కల్పించారు. ఏపీకి వెలుగు వస్తుందా అనే భయం గుప్పిట్లో బ్రతికాం. వచ్చీ రాగానే రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెన్షన్ పెంచాం. చంద్రబాబు విజన్ వల్లే పెన్షన్ పెంపు సాధ్యమైంది. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం’ అని అన్నారు.
‘ప్రధాని మోదీ సహకారంతో 2047 వైపు స్వర్ణాంధ్రలో అడుగులు పడుతున్నాయి. యోగాంధ్ర ప్రపంచ రికార్డును సృష్టించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాకెంతో ఇష్టం. గత ప్రభుత్వంలో అన్ని పథకాలకు సొంత పేర్లు పెట్టుకున్నారు. మా పాలనలో సామాజిక సేవ చేసిన వాళ్ల పేర్లతో పథకాలు అమలు అవుతున్నాయి. జాబ్ క్యాలెండర్ పేరులో గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ALSO READ: YS Jagan: వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. ఇదంతా కావాలనే చేశారు
కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే.. ఏపీ పరిస్థితి దారుణంగా ఉండేది. అధికారులు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. రౌడీ మూకల మధ్య రాష్ట్రం విలవిల్లాడింది. బాధ్యతాయుతంగా మేం ముందుకు వెళ్తున్నాం. ఈ మార్పు తీసుకురావడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి వెలుగు వైపు పయనిస్తున్నాం. కష్టాలు, ఒత్తిళ్లు ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం. బ్రాండ్ ఏపీని పునరుద్దరించి 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాం. నిరుద్యోగుల కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులనూ దారి మళ్లించింది’ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యం పట్ల వాళ్లకు ఏ మాత్రం గౌరవం లేదు. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే పోలీసులను బెదిరిస్తున్నారు. వాళ్ల రౌడీయిజం, అసాంఘిక పద్దతి ఏ మాత్రం మారలేదు. అనాగరికంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. పిచ్చి, పనికిమాలిన బెదిరింపులకు ఎవరూ భయపడరు. మాకు సంస్కారం ఉంది కాబట్టే ఇంకా పద్దతిగా మాట్లాడుతున్నాం. మంచి పాలన అందించాలనేదే మా ఆలోచన. 15 నుంచి 20 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నాం. సినిమాలో డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి. గొంతుకలు కోస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చాలా దెబ్బలు తిని ఇంతవరకు వచ్చాం’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అలాగే ఇటీవల జగన్ రప్పా రప్పా వ్యాఖ్యలపైకు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. గొంతులు కొసేస్తాం అని పిచ్చి పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.