ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు .. అయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒకటికీ రెండు సార్లు ఆలోచిస్తారంటారు. అలాంటి నేత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. దాంతో ఆయన పార్టీ మారతారనే ఊహగానాలు జోరుగానే వినిపించాయి. కానీ జగన్ శ్రీకాకుళం జిల్లాకి వచ్చినప్పుడు ఆయన తిరిగి జనంలోకి వచ్చారు. అసలు ఆయన సైలెంట్ అవడానికి? మళ్లీ యాక్టివ్ అవ్వడానికి కారణమేంటి?
ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు… జగన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన్ని కలవడానికి మందిమార్బలంతో వెళ్లారు .. జగన్ రాక సందర్భంగా కేడర్ తరలి రావాలని ధర్మాన ప్రసాదరావుకొడుకు, అన్న ధర్మాన కృష్ణదాస్ పిలుపునిస్తే పార్టీ శ్రేణులు స్పందించలేదంట.. దాంతో ప్రసాదరావే స్వయంగా పిలుపు ఇవ్వడంతో జిల్లా అంతా యాక్టివ్ అయ్యిందట. ఓ పక్క కొడుకు రాజకీయ జీవితం… మరోపక్క అన్న పదవికి గండం… మరోపక్క తన నియోజకవర్గంలో అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం.. ఇలా వరుసగా చక్రబంధంలో ఇరుక్కుంటుండటంతో.. ఈ చిక్కుముడి పీఠముడి కాకముందే తానురంగంలోకి రావాలని భావించారట.
సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు ఇంటి నుంచి బయటకు రావడంతో శ్రీకాకుళం వైకాపా శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది.. మన్యం జిల్లాకు మాజీ సీఎం జగన్ రావడంతో ఆయనను కలవడానికి ప్రసాదరావు వెళ్లారు. ఓటమి తర్వాత ఇన్ని నెలలకు ఆయనకు బయటకు వచ్చి… చాలా కాలం తరువాత జగన్‌ను కలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. శ్రీకాకుళం వైసీపీకి తానే దిక్కు అనుకున్న ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ పెద్దలు మరో ఇద్దర్ని తయారు అస్తున్నారనే టాక్ శ్రీకాకుళం జిల్లాలో నడుస్తుంది. దీంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు.
ఇంకా సైలెంట్‌గా ఉంటే రాజకీయంగా అసలుకు ఎసరు వస్తుందని భావించిన ప్రసాదరావు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు రాక తప్పలేదంట.. వాస్తవానికి వైసీపీ నేత పాలవలస రాజశేఖర్ మరణించిన సందర్భంగా అతని కుటుంబ సభ్యులను ఓదార్చడానికి జగన్ రెండు నెలల క్రితం పాలకొండ వచ్చారు. అప్పటికి ధర్మాన ప్రసాదరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే జగన్ పాలకొండ రావడంతో ఆయన వెళ్లి కలిశారంట.
పాలకొండలో దివంగత నేత పాలవలస రాజశేఖర్ కుటుంబం పరామర్శ తరువాత ఒంటరిగా ధర్మాన ప్రసాదరావును అధినేత జగన్ కలిసారంట.. అంతా గుట్టుగానే సాగింది.. సుమారు 10 నిముషాల పాటు మాట్లాడరట. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు అనేది బయటకి తెలియకపోయినా.. ఇటీవల ఆ ఇద్దరు మళ్లీ కలవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి ఎన్నికలలో ధర్మాన ఓడి పోయిన తరువాత ఎవరిని కలవలేదు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్ది ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మీటింగ్లకు కూడా అయన హాజరుకాలేదు. దాంతో ధర్మాన ప్రసాదరావు జగన్ తీరుపై అసంతృప్తి గా వున్నారనే వాదన కూడా వినిపించింది. అదే సమయం లో పార్టీ మారతారనే చర్చ కూడా బాగానే నడిచింది. ఆయన కూడా అటువంటి ఊహగానాలను ఖడించే ప్రయత్నం చేయలేదు.
ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ పెట్టిన మీటింగులకు దూరంగాఉన్న ధర్మాన ఇప్పుడు బెట్టు వీడి బయటకు రావడంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ధర్మాన యాక్టివ్ కాకపోతే ఆయన స్థానం లో శ్రీకాకుళం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్‌గా ఎవరో ఒకరిని నియమించెందుకు పార్టీ ఆలోచన చేసిందట. ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ నాయకులు ధర్మాన ఇంటికి వెళ్లి జిల్లాలో మీరే యాక్టివ్ గా ఉండకపోతే ఎలా? అని ఆయన్ని ప్రశ్నించారంట. అయితే మరో రెండేళ్లవరకూ తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, ఇప్పుడు రోడ్డెక్కినా చేసేదేమి లేదని ధర్మాన బదులిచ్చారంట. కొన్నాళ్లు మీరే తాడేపల్లి నుండి ఫాలో అప్ చేసుకోండి.. తానైతే ఇప్పటికిప్పుడు బయటకు రానని కరాఖండిగా చెప్పారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఓటమి తర్వాత తన కేడర్ని కూడా ఆయనే సైలెంట్ చేశారంటున్నారు.
కానీ సీన్ కట్ చేస్తే పాలకొండలో జగన్ కలవడానికి ధర్మాన ప్రసాదరావు మంది మార్బలంతో కలసి వెళ్లడం వెనక వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు… అసలే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ ప్రధాన కార్యాలయం లేకపోవడం.. ఉన్న అద్దె కార్యాలయం కూడా ఓటమి తరువాత ఖాళీ చేయడంతో సిక్కోలులో వైసీపీ చాప చుట్టేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ టాక్ తాడేపల్లి ప్యాలెస్‌కి చేరడంతో.. ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ కావాలి లేదంటే… లేదంటే శ్రీకాకుళం ఇంచార్జి గా ఎవరో ఒకరిని నియమించాలని జగన్ ఆదేశించారంట.
దాంతో ఇక ఆలోచిస్తూ కూర్చుంటే తన సీట్ కిందకి నీరొచ్చే ప్రమాదం ఉందని ధర్నాన హుటా హుటిన అధినేతను కలవడానికి పాలకొండకు వెళ్లారట… ఎప్పట్లాగే తాను మెట్టు దిగకుండా తన కొడుకుతో ఈ కార్యక్రమం నడిపించాలని ధర్మాన భావించినా.. అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఆయన స్వయంగా సీన్లోకి వచ్చారన్న వాదన వినిపిస్తుంది. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. జగన్‌తో సమావేశాలకు ప్రసాదరావు డుమ్మా కొట్టినప్పుడు అన్యారోగ్య కారణాలో? ఇంకొంకటో చెప్పి తమ్ముడ్ని కవర్ చేసుకుంటూ వచ్చారంట.
Read Also: రెండు చేతుల్లేవ్.. గుండె బరువెక్కిస్తున్న జొమాటో బాయ్ వీడియో!
అయితే ప్రసాదరావు ఎఫెక్ట్‌తో కృష్ణదాస్‌ను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సొంత తమ్ముడినే కృష్ణ దాస్ పార్టీలో యాక్టివ్ చేయలేకపోతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా… పార్టీని పట్టించుకోకపోయినా జగన్ వెనక్కి తగ్గరు అనేది అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా పార్టీ అధ్యక్ష పదవి తమ ఇంట్లోనే ఉంది కాబట్టి నెట్టుకొచ్చిన ధర్మాన ఇప్పుడు కృష్ణదాస్‌ను కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే జిల్లా పార్టీ వేరే వారి చేతికి వెళ్లిపోతుందన్న భయంతోనే జగన్‌ని కలిశారంటున్నారు.. మరి చూడాలి ధర్మాన ప్రసాదరావు ఇక నుంచిైనా యాక్టివ్ మోడ్‌లోకి వస్తారో? లేకపోతే మళ్లీ సైలెంట్ అయిపోతారో?