Case Filed on Director RGV: అందరూ భావించినట్టుగా ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు తాను వస్తానని, కాకపోతే నాలుగు రోజులు గడువు కావాలని అధికారులను కోరారు. ఈ లెక్కన శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం పోలీసులకు తాను నాలుగు రోజుల తర్వాత వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ. షూటింగ్ నిమిత్తం తాను బిజీగా ఉన్నారని అందులో పేర్కొన్నారట. దానికి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలీదు. కాకపోతే మంగళవారం విచారణకు మాత్రం హాజరుకాలేదు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు ఆర్జీవీ. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నోటీసులను స్వయంగా తీసుకెళ్లి వర్మకు అందజేసిన విషయం తెల్సిందే.
వర్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. వర్మ విచారణకు రాకపోవడంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే దానిపై ఆసక్తికరంగా మారింది. 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు పోలీసులు. రాకపోతే వర్మను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
విచారణ విషయంలో రామ్ గోపాల్‌వర్మ వెనుకడుగు వేశారన్నది కొందరి మాట. ఒక్కసారి విచారణకు వెళ్తే ఇరుక్కుంటామని, వెళ్లకుండా తప్పించుకోవడమే బెటరని తెలుస్తోంది. దీనిపై గత రాత్రి వైసీపీకి చెందిన కొందరు న్యాయవాదులతో మంతనాలు జరిపారట. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని, గడువు కోరాలని సలహా ఇచ్చారట.
మరోవైపు షూటింగ్ నిమిత్తం విచారణకు హాజరుకాలేకపోయానని చెబుతూ పిటిషన్ వేసేందుకు ఆర్జీవీ సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.