Indian Navy Rehearsa: వైజాగ్ బీచ్ వద్ద నేవీ డే రిహార్సల్స్ గురువారం జరిగాయి. విమానంలో ఆకాశంలోకి వెళ్లిన కమెండోలు, పారాషూట్లతో కిందికి రావాలి. కానీ ఒకరేమో ఒడ్డుకు రాకుండ, బీచ్ లోనే పడిపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో అందరూ షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే..!
వైజాగ్ బీచ్ వద్ద ఈనెల 4వతేదీన నేవి డే నిర్వహించనున్నారు. నేవీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దేశాఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రతి ఏడాది నేవి డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేవి కమెండోలు పలు విన్యాసాలను ప్రదర్శిస్తారు. అందుకై మూడు రోజులుగా వైజాగ్ బీచ్ వద్ద విన్యాసాల రిహార్సల్స్ విజయవంతంగా సాగుతున్నాయి.
గురువారం బీచ్ వద్ద కమెండోల విన్యాసాల రిహార్సల్స్ సాగాయి. ఈ దశలో చిన్న అపశృతి జరగడం విశేషం. రిహార్సల్స్ లో భాగంగా ముగ్గురు కమెండోలు విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. వారు ఆకాశం నుండి పారాషూట్ల ద్వార, కిందికి రావాల్సి ఉంది. వారిలో ఇద్దరు కమెండోలు మాత్రం కిందికి దిగారు. వారు అనుకున్న లక్ష్యానికి చక్కగా చేరుకున్నారు. కానీ ఒక కమెండో మాత్రం చేరాల్సిన గమ్యానికి కాకుండా, 100 మీటర్ల దూరంలో సముద్రంలో దిగారు. ఆ సమయంలో పారాషూట్, కమెండో నీటిలో పూర్తిగా మునిగిపోయారు. అనుకోకుండ జరిగిన ఈ ఘటనతో అధికారులు షాక్ తిన్నారు.
ఈ విషయాన్ని గమనించిన నేవి బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ కమెండోను రక్షించేందుకు జెమిని బోట్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి, నేవి సిబ్బంది రక్షించారు. సాధారణంగా నేవి విన్యాసాల సమయంలో అపశృతులు జరగవు. అలాంటిది వాతావరణం అనుకూలించక పోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సముద్రంలో పడ్డ కమెండోను వెంటనే సురక్షితంగా రక్షించడంలో నేవీ అధికారులు సఫలీకృతులయ్యారు.
Also Read: AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..
కాగా నేవీ రిహార్సల్ చూసేందుకు పెద్ద ఎత్తున విశాఖ వాసులు బీచ్ వద్దకు చేరుకున్నారు. విమానాల నుండి కమెండోలు చేసే విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. 4వ తేదీన జరిగే నేవీ డే ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది. అలాగే సీఎం చంద్రబాబు కూడ నేవీ ఉత్సవాలకు హాజరుకానున్నారు.