Not to sale petrol and Diesel in Loose and Water bottles: ఎన్నికల సంఘం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. సాధారణ ఎన్నికల నియామవళి ప్రకారం బాటిళ్లలో, కంటెయినర్లలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ నింపొద్దని సూచించింది.
రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రం పెట్రోల్, డీజిల్ నింపాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే బంకు లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా ఏపీలోని పెట్రోల్, డీజిల్ బంక్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలు చోట్లా హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మాచర్ల తోపాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ సమయంలో రోజు కూడా పలు ప్రాంతాల్లో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
వీటన్నిటినీ గమనించిన కేంద్ర ఎన్నికల సంఘంట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సమన్లు జారీ చేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా వారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు ఢిల్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆ తరువాత పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. హింసాత్మక సంఘటన విషయంలో వారు సరైన విధంగా స్పందించలేదు.. వాటిని నివారించడంలో వారు విఫలమయ్యారంటూ వారిపై వేటు వేసింది. వారి ప్లేస్ లో తాజాగా పలువురు అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్ గా బాలాజీని నియమించింది.
అయితే, రాష్ట్రంలో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఓటర్లు కూడా భారీగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం కూడా ఏపీలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత మరుసటి రోజు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతాల్లో పూర్తిగా భయానక వాతావరణాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడెక్కడైతే హింసాత్మక సంఘటనలో చెలరేగాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అదనపు బలగాలను రప్పించి భారీగా మోహరించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. వారి ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ లు ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీలో ఆ 3 జిల్లాలకు కొత్త పోలీస్ బాస్‌లు..
అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెలు భద్రను ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా ఈసీ పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ను బాటిళ్లు, కంటెయినర్లలో పోయొద్దని ఆదేశించినట్లు సమాచారం.