Summer Tips: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుని ప్రతాపం ధాటికి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. సమ్మర్ సీజనా మజాకా.. అప్పుడే ఎండలు ప్రజలను కలవరపెడుతున్నాయి. అందుకే ప్రజలు పలు జాగ్రత్తలు పాటించకుంటే, తప్పక అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండలే కాదు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందట. అయితే మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎండలపై సమాచారంకు విపత్తుల సంస్థ 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలిపేందుకు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ఏర్పాట్లు చేసింది.
ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలను ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను విపత్తుల సంస్థ సిద్దం చేసింది. అయితే వేసవి కాలం ముందస్తుగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారికంగా విపత్తుల సంస్థ విడుదల చేసింది. ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై తక్కువ ఖర్చుతో కూడిన వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించాలి. మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) పెంచాలి. అవి భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. మధ్యాహ్నం కిటికీలు, తలుపులు మూసి, కర్టన్స్ వేసి ఉంచాలి. సాయంత్రం వేళల్లో వెంటిలేషన్ కోసం వాటిని తెరవాలి.
Also Read: TG Govt: మహిళలకు సూపర్ కానుక.. ఉమెన్స్ డే ముందుగానే జీవో జారీ..
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తే, వడదెబ్బ బారి నుండి రక్షింపబడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే మార్చి లోనే ఎండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండగా, మున్ముందు మాత్రం కాస్త కష్టమే అంటున్నారు ప్రజలు. కానీ అధికారులు సూచించిన సూచనలు పాటిస్తే కాస్త వేడిగాలుల నుండి ఉపశమనం లభిస్తుందట. కాగా మార్చి 15 నుండి ఏపీలో ఒంటి పూట బడుల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం, రానున్న ఎండాకాలంలో ప్రజలకు వడదెబ్బ లక్షణాలపై చైతన్య పరచాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఇది ఇలా ఉంటే ఏపీలోని పలు స్వచ్చంధ సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుండగా, ప్రభుత్వం తరపున కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం.