Tirumala Hidden Secrets: తిరుమల శ్రీవారి గిరులు అంటే నామమాత్రపు కొండలు కావు. అవి పవిత్రత, పౌరాణికత, ప్రకృతి అద్భుత మిశ్రమం. అక్కడి ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి జలధార కూడా ఒక కథ చెబుతుంది. అటువంటి తిరుమల శేషగిరులలో 66 కోట్ల తీర్థాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది కేవలం ఊహ కాదు.. భక్తులు నమ్మే విశ్వాసం, పురాణ గాధల్లో చెప్పబడిన వాస్తవం.
పురాణాల ప్రకారం తీర్థాల విశిష్టత
తిరుమల పర్వతాల్లోని నీటి మూలాలు, చిన్న చిన్న పుష్కరిణులు, ప్రవాహాలు, నీరు నిలిచిన ప్రాంతాలు అన్నీ కలిపి తీర్థాలు అంటారు. ఇవి దేహ శుద్ధికంటే ఎక్కువగా మనస్సు శుద్ధికి ఉపయోగపడతాయి. పాపాలను పోగొట్టి, పుణ్యాన్ని అందించేవిగా ప్రసిద్ధి. అందుకే వీటిని పవిత్ర జలాలు అంటారు.
66 కోట్లు తీర్థాల రహస్యం ఏమిటి?
ఇది అక్షరాల సంఖ్య కాదు. ఇది ఒక సంకేతమని చెప్పాలి. ఈ తిరుమల గిరుల్లో ఎన్నో వేల నీటి మూలాలున్నాయనే ఆలోచనకు ప్రతీకగా 66 కోట్లని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి పర్వత శిఖరం, ప్రతి లోయలోనూ కొన్ని ప్రత్యేకమైన తీర్థాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు.
ప్రధానమైన కొన్ని తీర్థాలు..
శ్రీ స్వామి పుష్కరిణి.. ఆలయం పక్కనే ఉండే ఈ తీర్థం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పూర్వ జన్మ పాపాలూ తొలగిపోతాయని నమ్మకం. ఆకాశగంగ తీర్థం.. కొండల మధ్య నుంచే జలధారలా ప్రవహించే ఈ తీర్థం, స్వామివారి జటామండలంలోంచి వస్తుందని పురాణాల కథ. పాపవినాశనం.. ఈ తీర్థంలో స్నానం చేస్తే పేరు చెప్పినట్లే, పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. కపిల తీర్థం.. కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో ఇది పవిత్రంగా మారింది.
తీర్థాలు ఎందుకు ప్రత్యేకం?
ఈ తీర్థాల్లో నీరు ప్రకృతిగా ఉండటం ఒకవైపు, దేవతల శక్తి చేరిన జలాలుగా పరిగణించబడటం మరోవైపు. కొన్నింటిలో శిలలు కూడా దేవతల రూపాల్లో ఉంటాయని స్థానికులు చెబుతారు. ఒక్కో తీర్థానికి ఒక కథ, ఒక చరిత్ర ఉంటుంది. అటువంటి తీర్థాలు ఒక్కోటి తపస్సుల ఫలితమే.
ఎప్పుడు స్నానం చేస్తే శ్రేయస్సు?
పౌర్ణమి రోజులు, గరుడ సేవ రోజులు, బ్రహ్మోత్సవాల సమయంలో, పుష్కర కాలంలో తీర్థస్నానం చేయడం వల్ల పుణ్యం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తుంటారు.
తిరుమల తీర్థ యాత్ర
ఒకసారి తిరుమలకు వెళ్లినప్పుడు ఆలయం చుట్టుపక్కల ఉన్న ఈ తీర్థాలను కూడా సందర్శించాలి. అక్కడి ప్రకృతి, శాంతత, జలధారల శబ్దం.. ప్రతి నీటి బిందువు కూడా ఇక్కడ ఓ అనుభూతి. తిరుమల కొండలపై కొన్ని తీర్థాలు సాధారణ భక్తులకు కనిపించవు. అవి అడవుల్లో, లోయల్లో దాగి ఉంటాయి. కొన్ని చోట్లకి అర్చకులు మాత్రమే వెళతారు. ప్రతి గిరిపైనా ఏదో ఒక మహర్షి తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తపస్సు చేసిన ప్రదేశాల దగ్గరే తీర్థాలు ఉండటం విశేషం. కొన్నిచోట్లలో నీరు కనిపించకపోయినా.. ఆ ప్రదేశం పవిత్రమైందని చెబుతారు.
Also Read: Passengers Alert: వందేభారత్ ట్రైన్ లో ఇలా చేస్తే.. ఆన్ ది స్పాట్ జైలుకే!
తిరుమల గిరులు భక్తికి అర్థం, తీర్థాలు భక్తికి మార్గం. అక్కడి ప్రతి జలధార ఓ దైవ అనుగ్రహం. ఈ గిరుల్లో 66 కోట్ల తీర్థాలున్నాయన్న విశ్వాసం కేవలం నంబర్ల గురించి కాదు, అది భక్తి విశ్వాసం గురించి. మీరు తిరుమల యాత్రకు వెళ్తే, కేవలం ఆలయ దర్శనంతో మానుకోకండి. ఒక్కసారి ఈ తీర్థాలలో స్నానం చేసి చూడండి. అక్కడి శాంతిని, పవిత్రతను మీరూ ఆస్వాదించండి.