MP Raghunandan Rao: రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ పాలనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో భూభారతి చట్టం తీసుకువచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో కాని పనులు ఇప్పుడు భూభారతిలో ఎలాంటి లోపాలు లేకుండా జరుగుతున్నాయని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ధరణి పేరుతో ఏడిపించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు
భూభారతి చట్టం తీసుకువచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
గత పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను ధరణి పేరుతో ఏడిపించిందని వ్యాఖ్యలు pic.twitter.com/bWHXF7a3e6
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2025
భూభారతి చట్టం ద్వారా రైతులకు ఉపయోగం
భూ యాజమాన్య హక్కులను రక్షించడానికి, భూ వివాదాలను తగ్గించడానికి, రైతులకు, భూ యజమానులకు పారదర్శక సేవలను అందించడానికి రేవంత్ సర్కార్ భూభారతి చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం రైతులకు ఉపయోగపడే విధంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఈ క్రమంలోనే దుబ్బాక ను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల కలలను నిజం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన కోరారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ముందే ఈ ప్రాంత ప్రజలు దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ధరణి ద్వారా రైతులకు నష్టం: పొంగులేటి
ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ధరణి తీసుకువచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడితేనే ఆ దొరలను ఫామ్ హౌస్‌కి పంపారని తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 2 నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇచ్చి 6 వేల మంది సర్వేయర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. గత నాయకులకు ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ.. అర్ధరాత్రి VRA, VRO వ్యవస్థను తీసేశారని.. మళ్ళీ VRA, VRO వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని ఆయన తెలిపారు.
Also Read: Yashaswini Reddy : యంగ్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి ఇంటిపోరు..
ఇది పేదోడి ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని గత BRS నాయకులు సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయని తెలిపారు. భూభారతికి భయపడి దోపిడిదారులు పారిపోయారని.. అందుకే రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన తల తాకట్టు పెట్టి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్, సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. దేశంలోనే తెలంగాణని రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు.