Army Jawan Murali Naik: పాకిస్థాన్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఇప్పటికే బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న మురళీ నాయక్ మృతదేహాన్ని.. రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామానికి తరలించారు. వీర జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, భరోసా నిచ్చారు సీఎం చంద్రబాబు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ జమ్ము, కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ భారీ ఎదురు కాల్పులు జరపగా.. యుద్ధ భూమిలోనే ప్రాణాలు కోల్పోయారు.
వీర జవాన్ అంత్యక్రియలకు సీఎం చంద్రబాబుతో పాటు, స్థానిక పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సవిత హాజరు కానున్నారు. పలువురు అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అధికారిక లాంఛనాలతో మొదలు పెట్టనున్న అంత్యక్రియలకు.. పుట్టపర్తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లు.
ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభించడానికి మురళీ నాయక్ మృత దేహం బెంగుళూరు విమానాశ్రయం చేరింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పార్థివ దేహాన్ని స్వీకరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామానికి తరలించారు. మురళీ నాయక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు రోదిస్తూ, ఆవేదనను వెల్లగక్కుతున్నారు. వీర మరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియలు చూసేందుకు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు తరలి వస్తున్నారు.
వీర జవాన్ మురళి నాయక్‌కు నివాళులర్పించేందుకు.. తన చిన్నప్పటి స్కూల్ యాజమాన్యం తరలి వచ్చింది. మురళి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదివారు. చదువుతోపాటు గేమ్స్ లో కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉండేవాడని.. టీచర్స్ మురళితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పాకిస్తాన్‌తో జరిగిన యుద్దంలో వీరమరణం వీర జవాన్ మురళి నాయక్‌కు దేశమంతా ఘన నివాళులర్పించారు. ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, మురళి చిత్ర పటాలతో ర్యాలీలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత కూటమి నేతల ఆధ్వర్యంలో క్యాండిల్స్‌తో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్…మురళి నాయక్ అమర్హై అంటూ నినాదాలు చేశారు. మరోవైపు కదిరి పట్టణంలోనూ ఆర్ అండ్ బి బంగ్లా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు క్యాండిల్స్ ర్యాలీ చేశారు.
Also Read: పాక్ ఎటాక్.. జమ్మూ కశ్మీర్‌లో తెలుగు సైనికుడు వీర మరణం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వత్తులో ర్యాలీ నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఇటు కడపలోని ఎర్రముక్కపల్లి సర్కిల్ సైనిక స్తూపం వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అమరహే మురళి నాయక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మురళి నాయక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.