AP Government Employees: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే.. ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతున్నట్లు కనిపిస్తోంది. తమ డిమాండ్ల కోసం పోరుబాట పట్టేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీలు సిద్ధమయ్యాయి. ఇటీవలే.. తమ సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ని కలిశారు. తమ సమస్యల్ని పరిష్కరించేందుకు, రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు.. ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇస్తున్నట్లు చెప్పారు.. ఏపీ జేఏసీ నాయకులు. ఇప్పుడు.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ల సాధనం కోసం నిరసనలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి.. నిరసనలకు దిగుతున్నట్లు.. ట్రాన్స్‌కో, జెన్‌కో ఉన్నతాధికారులకు నోటీసులిచ్చారు.
తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనంటున్న ఉద్యోగులు
గత ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని.. కూటమి అధికారంలోకి వచ్చాకైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య అన్నారు. ఇప్పుడు కాళ్లరిగేలా తిరిగినా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని చెబుతున్నారు. కారుణ్య నియామకాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎనర్జీ సెక్రటరీ, సీఎస్‌ని కలిసినా.. ఇప్పటివరకు తమకిచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. న్యాయమైన డిమాండ్స్‌తోనే.. నిరసనలకు పిలుపునిచ్చామన్నారు.
మొన్న ఏపీ జేఏసీ, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఎనర్జీ సెక్రటరీ చెప్పిన హామీలను అమలు చేయకపోవడంతోనే.. ఆందోళనకు వెళ్తున్నట్లు తెలిపారు.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ వీర రాఘవరెడ్డి. సెక్రటేరియట్ ఉద్యోగుల జీతాలకు, తమకు ముడిపెడుతున్నారన్నారు. పీఆర్సీ, డీఏల విషయంలో.. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం తీరుస్తుందా?
న్యాయం చేయాలని అడిగితే.. గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందన్నారు విద్యుత్ జేఏసీ నేత శేషా రెడ్డి. త్యాగాలు చేసి చంద్రబాబుని గెలిపిస్తే.. తమకు న్యాయం చేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో 9 వేల ఖాళీలుంటే.. వాటిని భర్తీ చేయడం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు.
Also Read: గులాబీ శ్రేణుల్లో గుబులు.. ముదిరిన అన్న, చెల్లెలి వివాదం
డిమాండ్ల పరిష్కారానికి 3 నెలల గడువిచ్చిన ఉద్యోగులు
ఇటీవలే.. అమరావతిలో.. ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఒక్కో ఉద్యోగికి.. 3 నుంచి 5 లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు.. 15 నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందని జేఏసీ నేతలు చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు.. ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇస్తున్నామన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే.. అంతా కలిసి పోరుబాట పడతామన్నారు.