రాప్తాడు పరామర్శ అనంతరం నేరుగా బెంగళూరు వెళ్లిన జగన్ పెద్ద గ్యాప్ లేకుండా మళ్లీ తాడేపల్లికి వచ్చారు. ఈసారి కర్నూలు జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ పెట్టినప్పటినుంచి తనతోనే ఉన్న నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. విలువలు, విశ్వసనీయతే తమ పార్టీ సిద్ధాంతం అని, ఆ సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతాను అని అన్నారు. తనలోని విలువల్ని, విశ్వసనీయతను చూసే నాయకులు కష్టకాలంలో కూడా తన వెంటే నడిచారని గుర్తు చేశారు జగన్.
ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో శ్రీ @ysjagan సమావేశం.#YSJagan#AndhraPradesh pic.twitter.com/gYXny1mA7Q
— YSR Congress Party (@YSRCParty) April 10, 2025
నిజమేనా..?
తనలో విలువలు, విశ్వసనీయత ఉన్నాయని చెప్పుకున్నారు జగన్. అయితే టీడీపీ మాత్రం జగన్ సెల్ఫ్ డబ్బా భలే గట్టిగా కొట్టుకుంటున్నారని అంటోంది. అసలు విలువలు, విశ్వసనీయత లేనిదే జగన్ కి అని అంటున్నారు టీడీపీ నేతలు. అవే ఉంటే.. తన హయాంలో అధికార దుర్వినియోగం ఆ స్థాయిలో జరిగేది కాదని చెబుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారారు. అప్పట్లో చంద్రబాబుని, తీవ్రంగా విమర్శించిన జగన్, తాను అలాంటి పని ఎప్పుడూ చేయబోనని పదవికి, పార్టీకి రాజీనామా చేసిన వారినే వైసీపీలోకి తీసుకుంటానని చెప్పారు. సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ఓ గొప్ప ప్లాన్ వేశారు. పార్టీ మారే వారికి కండువాలు కప్పకుండా వారితో వచ్చిన బంధువులకు మాత్రం వైసీపీ కండువాలు కప్పేవారు. చివరకు ఫిరాయింపుల్ని కూడా ఇలా లీగలైజ్ చేసిన జగన్ కి నిజంగా విలువలు విశ్వసనీయత బాగా ఉన్నాయని సెటైర్లు పేలుస్తున్నారు టీడీపీ నేతలు.
ఆరెండు హామీలు అడగొద్దు..
అధికారంలోకి వచ్చాక వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నారు జగన్. నెలలు గడుస్తున్నా హామీ నెరవేరకపోయే సరికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. వారిని అరెస్ట్ చేయడమే కాదు, ఆ ఉద్యమాన్ని అణచి వేయలేదని ఏకంగా రాష్ట్ర డీజీపీనే లూప్ లైన్లో పెట్టేశారు. విలువలు, విశ్వసనీయత అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
మద్యపాన నిషేధం.. తూచ్
నవరత్నాల హామీలో మద్యపాన నిషేధం ఉంది. కానీ తానెప్పుడూ నిషేధం అనలేదని, అది నియంత్రణ అంటూనే.. లిక్కర్ రేట్లు పెంచారు. అమ్మఒడి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, నాన్న బుడ్డితో దాన్ని కవర్ చేశారని టీడీపీ నేతలు వెటకారం చేశారు. చివరకు అది నిజమేనని ఎన్నికల ఫలితాల్లో తెలిసొచ్చింది. అయినా ఇప్పటికీ మద్యపాన నిషేధంపై మాట్లాడేందుకు జగన్ సాహసం చేయట్లేదు.
బండ బూతులు..
రాజకీయాల్లో తిట్లు, బూతులు శృతిమించి పోయింది వైసీపీ హయాంలోనే అనే ఆరోపణ ఉంది. మంత్రులుగా ఉండి కూడా కొడాలి నాని వంటి నేతలు బూతులు తిట్టేవారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకునేవారు. లోకేష్ పుట్టుక గురించి నీఛంగా మాట్లాడారు. విశేషం ఏంటంటే అలా తిట్టిన వారికే జగన్ ప్రయారిటీ ఇచ్చేవారనేది మరో ఆరోపణ. చివరకు తిట్టేవారికే ఎన్నికల్లో టికెట్లిస్తామని కూడా జగన్ చెప్పారని కొంతమంది నేతలు బయట వాపోయారు. విలువలు విశ్వసనీయత అంటే ఇదేనా అని అడుగుతున్నారు టీడీపీ నేతలు.
చంద్రబాబుని చూసి నేర్చుకో..
జగన్ హయాంలో వందల మంది వైసీపీ నేతలు నేరుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా ఇతర నేతల్ని బూతులు తిట్టేవారు. కానీ ఎవరిపై ఎక్కడా చర్యలు లేవు. కూటమి ప్రభుత్వంలో తాజాగా చేబ్రోలు కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, పార్టీ తరపున పోలీసు కేసు పెట్టడం మరో విశేషం. విలువలు అంటే ఇవని, విశ్వసనీయత అంటే చంద్రబాబుది అని అంటున్నారు టీడీపీ నేతలు. తప్పులు చేసిన వారిని మెచ్చుకోవడం, వారికి పదవులిచ్చి మరింత పెద్ద తప్పులు చేసేలా ప్రోత్సహించడం జగన్ కి అలవాటు అని, అవే ఆయన పాటించే విలువలు అని కౌంటర్లిస్తున్నారు.
అధికారం పోగానే..
ఇప్పుడు అధికారం పోగానే జగన్ కి విలువలు, విశ్వసనీయత అనేవి గుర్తొచ్చాయని, వాటికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అవి లేవు కనుకే చాలామంది ఇప్పటికే ఆయన్ను వదిలి వెళ్లిపోయారని, ఆఖరికి ఆయన వెంటే నడిచే విజయసాయిరెడ్డి కూడా జగన్ రాజకీయాలు నచ్చక బయటకొచ్చేశారని అంటున్నారు. 2029నాటికి జగన్ వ్యవహారం పూర్తిగా జనాలకు తెలిసొస్తుందని, ఈసారి 11 సీట్లు కూడా రావని చెబుతున్నారు టీడీపీ నేతలు.