Jagan Guntur tour: వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరు పర్యటనకు శ్రీకారం చుట్టారు. మిర్చియార్డు పర్యటనపై ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ నేపధ్యంలో మిర్చి యార్డులో సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ మైకులో ప్రచారం చేశారు అధికారులు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన చేశారు.
జగన్ పర్యటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జగన్ పర్యటనపై సందిగ్థత నెలకొంది. ఒకవేళ గుంటూరు వైపు వస్తే.. జగన్ కాన్వాయ్‌ని అధికారులు అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పర్యనటపై గుంటూరు అధికారులకు గానీ, ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి కోరే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండే పర్యటన అని చెబుతున్నారు.
కేవలం మిర్చి యార్డులో ఉన్న రైతుల కష్టాలు తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ధరల పతనం ఎందుకు జరిగింది? ఈ విషయంలో రైతుల బాధను తెలుసుకునేందుకు మాత్రమే వస్తున్నారని అంటున్నారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నది వైసీపీ ఆలోచనగా నేతలు చెబుతున్నారు.
జగన్ పర్యటనకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా జగన్ పర్యటన షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు.
ALSO READ: జగన్‌కు కష్టాలు తప్పవా? కేసు నమోదు?
11 గంటలకు మిర్చి యార్డుకు రానున్నారు. 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడంతో మాజీ సీఎం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా మాత్రం జగన్ గుంటూరు మిర్చియార్డుకు వెళ్తున్నారని రాసుకొచ్చింది. మద్దతు ధర లేక గుంటూరు మిర్చియార్డు నుంచి కన్నీళ్లతో రైతులు ఇంటికి వెళ్తున్నారని ప్రస్తావించింది. అన్నదాతలకి అండగా నిలిచేందుకు జగన్ వెళ్తున్నట్లు పేర్కొంది.