“చిత్తూరులో జగన్ పర్యటన ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నెల్లూరులో రెండురోజుల ముందు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.” ఈ కామెంట్ వింటే కచ్చితంగా నవ్వొస్తుంది. అసలు ఆ పర్యటనకు, ఈ సంఘటనకు లింక్ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా..? అనుకుంటే అంత అమాయకులు ఎవరూ ఉండరు. ఎక్కడ చిత్తూరు, ఎక్కడ నెల్లూరు, అందులోనూ రెండ్రోజుల ముందు జగన్ పర్యటనపై దృష్టిలేకుండా చేయడానికి ఆ పార్టీ నేత ఇంటిపై టీడీపీ దాడి చేస్తుందా..? ఈ లాజిక్ లేని కామెంట్ చేసింది ఇంకెవరో కాదు, జగనే. అందుకే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.
నెల్లూరు దాడికి కారణం ఏంటి..?
నెల్లూరులో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి అసలు కారణం ఏంటో అందరికీ తెలుసు. అయితే ఆ కారణం వల్ల అంత తీవ్రమైన దాడి చేయాలా, సైలెంట్ గా ఉండాలా అనేది వేరే అంశం. అయితే జగన్ ఇక్కడ తన పర్యటనను ఈ ఘటనకు ముడిపెట్టడం హాస్యాస్పదం. “చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి.” అంటూ జగన్ ట్వీట్ వేశారు.
.@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025
హత్యాయత్నమా..?
హత్యాయత్నం అంటే నేరుగా ఆ వ్యక్తిపైనే దాడి చేయాలి. కానీ ఇక్కడ నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం అయింది, కారు కూడా తిరగబడింది. ఆ ఇంటిలో కొంతమంది ఉన్నా కూడా వారి జోలికి ఎవరూ వెళ్లలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి ఓ మీటింగ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, దానికి ప్రతిగా గంటల వ్యవధిలోనే ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఒకవేళ అది హత్యాయత్నం అయితే నేరుగా ప్రసన్నపైనే తిరగబడేవారు, ఇంటిపైకి వచ్చారు కాబట్టి నిరసన తెలిపేందుకు అనుకోవచ్చు. అయితే ఆ నిరసన ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.
ఇంత లేట్ గానా..?
దాడి జరిగింది సోమవారం రాత్రి. జగన్ ట్వీట్ వేసింది బుధవారం మధ్యాహ్నం. ఇంత లేటుగా అంత ఘాటు ట్వీట్ ఎందుకంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం ఎందుకని జగన్ సైలెంట్ గా ఉన్నారేమో అనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం నింపాదిగా తన టూర్ సందర్భంగా ట్వీట్ వేశారు. తమ పార్టీ నేతపై హత్యాయత్నం జరిగిందని, ఇది రెడ్ బుక్ పాలన అంటూ అలవాటైన డైలాగులు కొట్టారు.
మరి దాన్నేమంటారు..?
గతంలో వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిని ఏమంటారు..? అని నెటిజన్లు సూటిగా జగన్ ని ప్రశ్నిస్తున్నారు. ఇది హత్యాయత్నం అయితే అప్పుడు అది చంద్రబాబుపై హత్యాయత్నం అనుకోవాలా..? అలాంటి చర్యల్ని జగన్ అప్పుడు లైట్ తీసుకున్నారు. మరిప్పుడు ఎందుకంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎదుటివారిపై దాడి చేస్తే అది కరెక్ట్, తమవారిపైనే దాడి జరిగితే సింపతీ చూపించాలనే జగన్ తీరు సరికాదని మండిపడుతున్నారు నెటిజన్లు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించకుండా, కేవలం దాడి గురించే మాట్లాడటం జగన్ నీఛ రాజకీయాలకు పరాకాష్ట అంటున్నారు.