Jagan Tour: జగన్ రూటు మార్చారా? ప్రజల్లో లేకుంటే తనను మరిచిపోతారని డిసైడ్ అయ్యారా? నిత్యం వార్తల్లో ఉండేందుకు ఈయన ప్రయత్నాలు చేస్తున్నారా? తిరుమలకు వెళ్తే మైలేజీ వస్తుందని భావిస్తున్నారా? ఈసారైనా డిక్లరేషన్ మీద జగన్ సంతకం పెడతారా? సంతకం చేస్తే స్వామి వారి దర్శనం అంటున్న టీటీడీ వర్గాలు. గతంలో మాదిరిగా డిక్లరేషన్ ఇచ్చేది లేదంటున్న వైసీపీ వర్గాలు. మళ్లీ ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని చర్చించుకుంటున్నారు నేతలు.
ఏడాది తర్వాత మెల్లగా మాజీ సీఎం జగన్ యాక్టివేట్ అవుతున్నారు. అధికార పార్టీపై ఏదోఒక బురద జల్లుతూనే ఉన్నారు. ఓ వైపు నేతలను సజ్జల యాక్టివేట్ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు మాజీ సీఎం జగన్. ఇదేక్రమంలో టీడీపీ నేతల పాత వీడియోలను తెరపైకి తెస్తున్నారు.
ఈనెల 27న వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. జగన్ తిరుమల అంటే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు అదే మొదలైంది. అన్యమతస్తుడు కావడంతో డిక్లరేషన్‌పై సంతకం పెడితేనే స్వామి దర్శనం అంటున్నాయి టీటీడీ వర్గాలు. ఈసారి వెనక్కి తగ్గేది లేదని అంటున్నాయి.
కొద్దిరోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య లెజినోవా తిరుమల వచ్చి డిక్లరేషన్‌పై సంతకాలు చేశారని గుర్తు చేస్తున్నారు. జగన్ తిరుమల వస్తే కచ్చితంగా సంతకం చేయాలని అంటున్నాయి. లేకుంటే స్వామి దర్శనం జరగదని తెగేసి చెబుతున్నాయి. గతంలో మాదిరిగా డిక్లరేషన్ ఇచ్చేది లేదంటున్నాయి వైసీపీ వర్గాలు.
ALSO READ: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక
ఉన్నట్లుండి జగన్ తిరుమల రావడానికి కారణమేంటి? టీటీడీ వ్యవహారాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడు-భూమన కరుణాకర్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో జగన్ తిరుమల వస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది ఒకవైపు వెర్షన్ మాత్రమే.
రెండోవైపు వచ్చేనెల నుంచి మెల్లగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారట. ముఖ్యనేతల సమావేశంలో జిల్లాల టూర్లపై ముహూర్తం ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఓసారి సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని జగన్ భావించారు. ఏమైందో తెలీదుగానీ అనుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు అదే ఒరవడి కంటిన్యూ అవుతుందా? లేదా అంటూ చర్చించుకోవడం ఆ పార్టీ కేడర్ వంతైంది.
దసరాకు ముందు పర్యటన చేస్తే బాగుంటుందా? ఆ తర్వాత చేస్తే బాగుంటుందా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు. ముందే అయితే అందరు ఊళ్లలో ఉంటారని.. లేకుంటే కష్టమనే వాదన నేతల్లో ఉంది. ఇకపై ప్రతి జిల్లాలో రెండు రోజులు జగన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నేతలు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారట.
ఈలోగా లిక్కర్ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చి, నోటీసులిస్తే ఏంటనే చర్చ అప్పుడే ఆ పార్టీలో మొదలైంది. ఈ కేసు ముగింపు దశకు వచ్చిందని ఇటీవల నిందితుల బెయిల్ పిటిషన్ సందర్భంగా సిట్ న్యాయస్థానికి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.