Heavy rain: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాబోయే రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యదిశగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
రేపు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు కీలక హెచ్చరికలను జారీ చేశారు.
ALSO READ: Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి
రాయలసీమలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదోని మండలం వర్షానికి అతలా కుతలం అయ్యింది. మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఇతరులను ఆదోని నుంచి వచ్చిన వారిని ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా గ్రామాల్లోకి చేర్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని కోస్తా జిల్లాలు, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.