Amaravati: సీనియర్ రాజకీయ నేత మజ్జి శ్రీనుకు టీడీపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ని అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది. పార్టీలో చేరిన నెలరోజులకు శ్రీనుకు ఈ పదవి అప్పగించడం వెనుక టీడీపీ అసలు ప్లాన్ ఏంటి? ఈ నియోజకవర్గం టీడీపీకి మొదటి నుంచి తల నొప్పిగా తయారు అయ్యిందా? ఈ క్రమంలో దాని వ్యవహారాలను ఆయనకు అప్పగించారా? మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన పట్టు నిలుపుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
విజయనగరం సీనియర్ రాజకీయ నేత మజ్జి శ్రీనుకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని అరకు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించారు. పార్టీలో చేరిన నెల రోజులకు మజ్జి శ్రీనును ఈ పదవిలో నియమించారు. విజయనగరం నుంచి తప్పించి, ఆయనకు అరకు ఎందుకు ఇచ్చారన్నది అసలు ప్రశ్న. ఉమ్మడి ఏపీలో అరకు నియోజకవర్గం టీడీపీ కంచుకోట.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మొదటి నుంచి ఓటమి ఎదురైన నియోజకవర్గాల్లో అరకు లోక్‌సభ సీటు ఒకటి. విజయనగరం జిల్లాలోని చాలా భాగం అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. శ్రీను రంగంలోకి దింపితే బావుంటుందని భావించింది టీడీపీ హైకమాండ్. అక్కడ దిగువ స్థాయి నుంచి నేతలను బలోపేతం చేస్తే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అరకు సీటు గెలవడం ఈజీ అవుతుందన్నది టీడీపీ అంచనా. ఈ క్రమంలో ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు సీనియర్ల మాట. ఈ పదవిపై అధికారిక ప్రకటన రాకముందు శ్రీను రంగంలోకి దిగేశారు. ఏజెన్సీకి చెందిన కీలక నేతలతో వరసగా సమావేశాలు మొదలు పెట్టేశారు. ఇటీవల పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భూదేవితో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గంలోకి వచ్చే నేతలతో సమావేశాలు నిర్వహించారు.
ALSO READ: చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ
ఆయా నియోజకవర్గాల్లో శ్రీనుకు పరిచయాలు ఉండడంతో ఈసారి అరకు సీటు టీడీపీ జెండా ఎగురువేయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మూడు ఎన్నికల్లో అరకు సీటును వైసీపీ గెలుస్తూ వస్తోంది. ఆ పార్టీకి బలమైన కేడర్ ఉందని స్థానికుల మాట. రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్ లుంటే అరకు పార్లమెంట్‌లో మూడు జిల్లా పరిషత్‌లు ఉన్నట్లు ఓ లెక్క. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా పరిషత్ కూడా అందులోకి వస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అరకు లోక్‌సభ అబ్జర్వర్‌గా శ్రీనుకు నియమించడం పెద్ద టాస్క్ అని అంటున్నారు. చిన్న శ్రీను రంగంలోకి దిగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది టీడీపీ ఆలోచన. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు.