Pastor Praveen Pagadala Case : ఐదు రోజులు అవుతోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయారనే ఉత్కంఠ నడుస్తోంది. ప్రమాదమా? చంపేశారా? అనుకోకుండా జరిగిందా? పక్కా ప్లాన్డ్‌గా లేపేశారా? ఇది వాళ్ల పనేనా? ఇలా రకరకాల చర్చలు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి? దాడి చేసి కొట్టారా? కిందపడి గాయపడ్డాడా? బైక్ హెడ్‌లైట్ ఏమైంది? పక్కనుంచి వేగంగా వెళ్లిన ఆ రెడ్ కార్ ఎవరిది? ఇలా మీడియాలో గంటల తరబడి డిబేట్లు. వీ వాంట్ జస్టిస్ అంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన. వేలాదిగా ఉన్న ప్రవీణ్ అనుచరుల్లో ఆగ్రహావేశాలు. సంయమనం పాటించాలని అన్నివర్గాల సూచనలు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో.. ప్రవీణ్ పగడాల మృతిపై ఏలూరు ఐజీ అశోక్ కుమార్ పెట్టిన ప్రెస్‌మీట్‌తో ఫుల్ క్లారిటీ వస్తుందని అంతా ఆతృతగా చూశారు.
మీడియా సమావేశం అయితే పెట్టారు కానీ.. అందులో ఇచ్చిన స్పష్టత ఏమీ లేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారో పోలీసులు చెప్పలేక పోయారు. పాస్టర్ మరణానికి కారణం ఏంటో పసిగట్టలేక పోయారు. పైగా విజయవాడలో ఆ 4 గంటలు ఏం చేశాడు? ఆయన ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి? బుల్లెట్ బండి ఎలా పడింది? అంటూ మరిన్ని డౌట్స్ క్రియేట్ చేసేలా చేసింది. ప్రవీణ్ డెత్ మిస్టరీ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది.
డౌట్ నెంబర్ 1 : విజయవాడలో ప్రవీణ్ ఏం చేశారు?
మార్చి 24, ఉదయం 11 గంటలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలు దేరాడు ప్రవీణ్. మధ్యాహ్నం 1 గంటలకు చౌటుప్పల్ టోల్‌గేట్ దాటాడు. విజయవాడకు సాయంత్రం నాలుగున్నరకు చేరుకున్నాడు. సుమారు నైట్ తొమ్మిది వరకు ఆయన బెజవాడలోనే ఉన్నట్టు అనుమానం. మరి, ఆ 4 గంటలు ఆయన ఏం చేశారనేది పోలీసులకు సైతం అంతుచిక్కడం లేదు. విజయవాడలో ఎక్కడున్నారు? ఎవర్ని కలిశారు? ఏం చేశారు? అనేది సమాధానం లేని ప్రశ్న.
డౌట్ నెంబర్ 2 : ప్రవీణ్ బైక్ హెడ్‌లైట్ డ్యామేజ్‌కి రీజనేంటి?
ప్రవీణ్ బుల్లెట్ బండి లైట్ డ్యామేజ్‌పై మొదటినుంచీ అనుమానాలు ఉన్నాయి. 5 రోజుల విచారణ తర్వాత కూడా పోలీసుల సరైన కారణం చెప్పలేకపోయారు. సీసీకెమెరాల్లో ఆయన నడుపుతున్న బైక్‌కు హెడ్‌లైట్ వెలగలేదు. ఘటనకు ముందే లైట్ డ్యామేజ్ అయింది. స్పాట్‌లో పడి ఉన్న బండిని చూస్తే ఆ విషయం తెలిసిపోతోంది. మరి, ఆ లైట్ ఎక్కడ డ్యామేజ్ అయింది? ఎలా డ్యామేజ్ అయింది? స్పాట్‌కు ముందు మరో అవాంచనీయ ఘటన ఏదైనా జరిగిందా? ఇలాంటి ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు రాలేదు.
డౌట్ నెంబర్ 3 : ఆ రెడ్ కలర్ కారు సంగతేంటి?
సీసీకెమెరాలో కనిపించిన ఆ 4 వాహనదారులను విచారించామని.. వారికి ప్రవీణ్ ఘటనకు ఎలాంటి సంబంధంలేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే, ప్రవీణ్ ఘటనతో సంబంధం లేకపోతే.. వాళ్లు అలా నిర్లక్ష్యంగా ఎందుకు వెళ్లిపోయారనే అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రవీణ్ డెడ్‌బాడీపై బైక్ ఎలా పడిందని ప్రశ్నిస్తున్నారు. కారు ఢీ కొడితేనే బుల్లెట్ బండి కింద పడిందా? లేదా? అనేది ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారని ఐజీ చెప్పారు. ఈ విషయం చెప్పేందుకు 5 రోజుల సమయం సరిపోలేదా? అని ప్రవీణ్ అభిమానులు అడుగుతున్నారు.
డౌట్ నెంబర్ 4 : ప్రవీన్ ఒంటిపై గాయాలు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్..
పాస్టర్ ప్రవీణ్ ముఖం, చేతులపై కొన్ని గాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆ గాయాలు ఎలా అయ్యాయి అనే విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. పోస్ట్‌మార్టం పూర్తి రిపోర్ట్ ఇంకా తమకు అందలేదని చెబుతున్నారు. ఇంతటి కీలకమైన కేసులో పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం రిపోర్టు ఇచ్చేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారనే డౌట్ చాలామందిలో ఉంది.