Minister Narayana : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు సైతం వివిధ శాఖ అధికారులుతో సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలపై స్పెసల్ ఫోకస్ పెట్టారు. తాజాగా నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఏపీలో పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఇకపై ఆ ప్లాన్ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియను సంబంధిత మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారని తెలిపారు. ప్లాన్ ప్రకారం భవనాన్ని నిర్మించకుంటే.. సంబంధిత లైసెన్స్ డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు బాధ్యత వహించాలని మంత్రి నారాయణ తెలిపారు.
ALSO READ : పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..
భవన నిర్మాణాల్లో సంబంధిత లైసెన్స్ డ్ సర్వే యర్ లేదా ఇంజనీర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు. ఈ భవన నిర్మాణాల్లో ఎక్కడైనా డీవియేషన్ ఉంటే సంబంధిత ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన ఫీజులు, వివిధ శాఖలకు సంబంధించిన ఫీజులు ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫైర్, రిజిస్ట్రేషన్, శానిటరీ లాంటి ఇతర శాఖల అనుమతులు సైతం ఇకపై ఆన్ లైన్‌లోనే వస్తాయన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని తెలిపారు. ఇప్పటి వరకూ ఎక్కడా భవన నిర్మాణ అనుమతులకు ఆన్ లైన్ విధానంలేదని.. దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నామన్నారు.
పలు శాఖలు సాఫ్ట్ వేర్, మంత్రిత్వ శాఖతో అనుసంధానం అయ్యే విధంగా కొత్త విధానం తీసుకువస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే నెలలోపే జరిగే విధంగా చూస్తామన్నారు. ఇక రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయని… వాటిని త్వరలోనే అధిగమిస్తామని హామీ ఇచ్చారు. కొత్త లేఔట్లకు 12 మీటర్ల మేర రహదారులను నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి రహదారుల వెడల్పు కచ్చితంగా 9 మీటర్లు ఉండేలా నిబంధనలు తీసుకొస్తున్నామన్నారు. ఇక కొత్త విధానం అమల్లోకి వస్తే భవన నిర్మాణం అనుమతులు సులభతరం అవుతాయని.. కొత్త విధానంపై బిల్డర్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నారని పేర్కొన్నారు.