Minister Narayana: ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. దీనిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ విషయాన్ని సభా సాక్షిగా వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
అమరావతికి టార్గెట్ ఫిక్స్
అమరావతి పనుల పూర్తికి 64 వేల 721 కోట్లతో ఎస్టిమేషన్ వేశామన్నారు. ప్రస్తుతం టెండర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. 2019-24 మధ్యకాలంలో రాజకీయ అనిశ్చితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. 2028 నాటికి రైతులకు ఇవ్వాల్సిన లేఅవుట్‌లు వేసి ఇస్తామన్నారు.
రాజధాని అమరావతి కోసం నిధులను వివిధ రూపాల్లో సేకరించి నిర్మాణం చేపడు తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల ద్వారా నిధులు సేకరించామన్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను కేవలం మూడేళ్లలో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచంలో టాప్-5 నగరాల్లో అమరావతి ఉండాలనే రాజధానిని డిజైన్ చేశారన్నారు.
నిధులు ఎక్కడ నుంచి
వరల్డ్ బ్యాంకు-ఏడీబీ రూ. 13,400 కోట్లు, కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు ఇచ్చిందన్నారు సదరు మంత్రి. హడ్కో రూ.11 వేల కోట్లు, కేంద్రం గ్రాంటు కింద రూ.1560 కోట్లు ఇస్తోందని వివరించారు. మెయిన్ రోడ్లను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఎల్‌పీఎస్ రోడ్లు, డ్రైనేజీ మూడు సంవత్సారాలు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వివరించారు.
ALSO READ: మండలిలో ‘ఇసుక’పై మంటలు
చివరి దశలో టెండర్లు
అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మూడేళ్లలో పూర్తవుతాయని వెల్లడించారు. సగానికి పైగా నిర్మాణాలు జరిగిన వాటిని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. మిగతావి రెండేళ్లు కాగా.. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు మూడేళ్లు టైమ్ ఫిక్స్ చేసినట్టు వెల్లడించారు.
136 ఆర్గనైజేషన్లుకు 1277 ఎకరాలు ఇచ్చామన్నారు మంత్రి నారాయణ. 31 ఆర్గనైజేషన్‌లకు 629.3 ఎకరాలకు అంగీకారం తెలిపామన్నారు. గతంతో 13 సంస్ధలకు ఇచ్చిన భూములు రద్దు చేశామన్నారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రచ్చర్, రోడ్డు, స్ట్రామ్ వాటర్, వాకింగ్ ట్రాక్స్ వంటి సదుపాయాలు ఉంటాయన్నారు.
1280 ఎల్‌పీఎస్ రోడ్లు, కొండవీటి వాగు, వాగు గ్రావిటీ కెనాల్‌లకు టెండర్లు పిలిచామన్నారు. 62 పనులను టెండర్లు అయిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వం 50 వేల మందికి సెంటు లెక్కన అమరావతిలో భూమి ఇచ్చారన్నారు. ఇందుకోసం ఆర్‌ఫైవ్ జోన్ క్రియేట్ చేశారన్నారు. వారికి ఆల్టర్నేట్ భూమి ఇచ్చి ఆ ల్యాండ్‌ను తీసుకుంటామని సభలో పేర్కొన్నారు మంత్రి నారాయణ.
ఒక్క అంగుళం భూమి లేదన్న సుజనా
అమరావతి పరిధిలో తనకు 600 ఎకరాలు ఉన్నాయని గతంలో నోటీసు ఇచ్చారని తెలిపారు బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి. తనకు, కుటుంబానికి అంగుళం భూమి కూడా లేదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఎవరో తేల్చాలని స్పీకర్‌ను కోరారు. సీఆర్డీఏ చట్టంలో విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ హింసించారని గుర్తు చేశారు. ఈ విధంగా ఇబ్బందులు పెట్టినవారిని శిక్షించాలన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే సీఆర్డీఏ చట్టాన్ని రేరా పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.