Ramprasad Reddy On Roja: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాకిచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా రోజా కొనసాగారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశం మీదనే ప్రస్తుతం రోజాకు షాకిచ్చేందుకు కూటమి సిద్దమైందని చెప్పవచ్చు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు నాడు జగన్ అన్నారు. ఈ సంధర్భంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు పలు క్రీడలకు సంబంధించి కిట్లను కూడా అందజేశారు. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇంటింటికీ వెళ్లి పలు వివరాల నమోదు కార్యక్రమం సైతం సాగింది. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఆ సమయంలో కేవలం క్రీడాకారుల గుర్తింపు కోసం సర్వే సాగిందని ప్రకటనలు ఇచ్చింది.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నేతలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడినట్లు పలు మార్లు ఆరోపించారు. ప్రధానంగా నాటి మంత్రి హోదాలో గల రోజాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. రోజా కూడా స్పందిస్తూ.. కేవలం గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి రాంప్రసాద్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం రూ. 119 కోట్లు ఖర్చు చేసిందని, అందులో తప్పక అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడిందని ఆరోపించినట్లు భావించవచ్చు. అలాగే ఆ సమయంలో మాజీ మంత్రి రోజా ఈ కార్యక్రమం భాద్యతలను పర్యవేక్షించారు.
Also Read: Jagan on Pawan Kalyan: పవన్ పై జగన్ గురి.. కార్పొరేటర్ కు ఎక్కువ అంటూ ఘాటు విమర్శ..
ప్రస్తుతం నివేదిక తయారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కాగా, ఈ అంశంపై రోజా ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఆవినీతి జరిగిందా లేదా అన్నది అసెంబ్లీకి సమర్పించే నివేదికను బట్టి చెప్పవచ్చు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లలో గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అందుకే టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన తర్వాత, టూరిజం శాఖ ద్వారా అందించే టికెట్లను రద్దు చేశారు. ఇటీవల మరలా ఆ టికెట్లను టీటీడీ పునరుద్దరించింది.
మాజీ మంత్రి రోజాకు షాక్.. ఆడుదాం ఆంధ్రాపై విచారణ
గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై శాసన మండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దీనిపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటన
45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తామన్న మంత్రి రాంప్రసాద్
ఆడుదాం ఆంధ్ర కోసం గత… pic.twitter.com/6Pxp9sFKdU
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025