Big Stories

Jagan: ఉత్తరాంధ్ర ఓటర్లు జగన్‌కు ఏం మెసేజ్ ఇచ్చినట్టు?

Jagan: త్వరలో విశాఖ నుంచే పాలన. సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ ఊదరగొడుతున్నారు. ఢిల్లీ, బెంగళూరులోనూ ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. విశాఖను నెత్తిన పెట్టుకుంటోంది ఏపీ సర్కారు. అయినా… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలతో కూడిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. విశాఖకు రాజధాని తరలిస్తే.. అక్కడి ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుంటారని అధికార పార్టీ భావిస్తే.. విద్యావంతులైన ఓటర్లు మాత్రం ఫ్యాన్ రెక్కలు విరిచి.. మడతబెట్టి.. జగన్ చేతిలో పెట్టారు.

- Advertisement -

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని ఓడిపోవడం సీఎం జగన్‌కు షాకింగ్ పరిణామమే. మూడేళ్లుగా విశాఖ..విశాఖ.. అంటూ ఊదరగొడుతున్నా.. ఓటర్లు మాత్రం అక్కున చేర్చుకోకపోవడం సంచలనమే. ఇన్నాళ్లూ ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖకే పరిమితం చేసి.. ఉత్తరాంధ్ర బాధ్యతలు కట్టబెట్టి.. ఆ ప్రాంతానికి సామంతరాజును చేసినా.. ఆయన వల్ల వచ్చిన ఓట్లెన్ని? పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి పనితనం ఇంతేనా? బొత్స లాంటి సీనియర్ మంత్రి ఉన్నా వైసీపీకి ఒరిగిందేంటి? గుడివాడ అమర్నాథ్‌ను మంత్రిని చేసినా ఉపయోగం ఏంటి? ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, రాజన్నదొరలు కేబినెట్‌లో ఉన్నా యూజ్ ఏంటి? ఉత్తరాంధ్రలో వైసీపీ పరాజయానికి అసలు కారణం ఏంటి? అంటూ విశ్లేషణలో మునిగిపోయింది తాడేపల్లి ప్యాలెస్.

- Advertisement -

వైసీపీ బలహీనపడిందా? ఇదే సమయంలో టీడీపీ బలపడిందా? అంటే అలా అనుకోడానికి లేదంటున్నారు. పార్టీ బలాబలాలకంటే పట్టాభద్రుల మైండ్‌సెట్టే ఇక్కడ కీ రోల్ ప్లే చేసిందని అంచనా వేస్తున్నారు. గ్యాడ్యుయేట్స్ స్థానం కావడంతో ఓటర్లలో అధికశాతం నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. ఈ రెండు కేటగిరీ ఓటర్లు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటించినా.. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అంతంతమాత్రమే. వాలంటీర్ల భర్తీని ఉద్యోగాలుగా చూడటం లేదు. దీంతో నిరుద్యోగులు జగన్ పాలనపై అప్‌సెట్‌గానే ఉన్నారంటున్నారు. ఇక కీలకమైన ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే చెప్పనవసరం లేదు. పీఆర్సీ పెంపు, డీఏ చెల్లింపు, సీపీఎస్ రద్దు విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు ఉద్యోగులు. ఎప్పుడు సమయం దొరుకుతుందా, రివేంజ్ తీర్చుకుందామా అని కసితో ఉన్నారు. అలా ప్రభుత్వ ఉద్యోగులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా వైసీపీ ఓటమిపై ప్రభావం చూపిందని తెలుస్తోంది. గుంతలు పడిన రోడ్లు సైతం అధికార పార్టీ ఓటమికి ఓ ప్రధాన కారణం అంటున్నారు. వెండి బిస్కెట్లు పంచినా నో యూజ్. రుషికొండను తవ్వేయడం, భూముల కబ్జా తదితర అంశాలూ వైసీపీ ఓటమికి కారణాలే. అటు, టీడీపీ మాత్రం స్థానికంగా మంచి పేరున్న.. ఎకానమీ ప్రొఫెసర్ చిరంజీవిని రంగంలోకి దింపి ఓటర్లను మరింతగా ఆకట్టుకుంది. సునాయాసంగా విజయం సాధించింది.

సో, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, విశాఖ నుంచే పాలన, సంక్షేమ పథకాలు, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే డబ్బులు.. ఇవి చాలు తమను గెలిపించడానికి అని ఇన్నాళ్లూ వైసీపీ భావించింది. కానీ, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టాభద్రులు అధికార పార్టీకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. రాయలసీమలోనూ వైసీపీ అభ్యర్థులకు షాక్ తగలడం.. జగన్‌ను ఆలోచనలో పడేసే అంశమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News