Mumbai actress: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఎంతవరకు వచ్చింది? విచారణ అధికారికి ఇచ్చిన గడువు ముగిసిపోయిందా? గతరాత్రి విజయవాడకు ముంబై నటి ఎందుకు వచ్చింది? దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్‌ని కలవడం వెనుక కారణమేంటి? నటి ఫిర్యాదు చేసిందా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆమె విజయవాడకు వచ్చి దాదాపుగా వారం గడిచిపోయింది. మళ్లీ గతరాత్రి విజయవాడకు వచ్చారామె. నేరుగా కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్‌ని కలిశారు. తనపై తప్పుడు కేసు పెట్టి వేధించిన వ్యవహారంపై ముగ్గురు టాప్ ఐపీఎస్ పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు.
ALSO READ: ఆ రెండూ.. ఏపీ వరదలకు కారణం: శివరాజ్ సింగ్
సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ పేర్లు ముంబై నటి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టారని, చివర కు పేరెంట్స్‌ని అరెస్టు చేశారని వివరించింది.
ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడం, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ముంబై వచ్చిన అరెస్టు చేయడం కుట్రభాగమేనన్నది నటి వెర్షన్. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్ట్ చేసి తనను, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలన్నది ఫిర్యాదులో కీలక పాయింట్.
ఫిర్యాదు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 17 కేసులున్న విద్యాసాగర్‌కు ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుందో తెలీదన్నారు. దీనికి రాజకీయం చేయడం అన్యాయమన్నారు. కొందరు టాప్ పోలీసులు అధికారులు పరిధి దాటి వ్యవహరించారని, వారిపై ఫిర్యాదు ఇచ్చానని వెల్లడించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలక ఆధారాలు ఉన్నాయని, ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదని తెలియజేశారు.
ఇదిలావుంటే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి జత్వానీ నుంచి సీజ్ చేసిన వస్తువులు తిరిగి ఆమె ఇవ్వవద్దంటూ విద్యాసాగర్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు ఆమె గురించి టీవీ డిబేట్లు, నటి ఎలాంటి ప్రెస్‌మీట్‌లు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
విద్యాసాగర్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణ వరకు కేసులోని ఆధారాలు భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసును ఈనెల 11కి వాయిదా వేసింది. ఒకవేళ ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఉన్న కేసు విచారణకు సమాంతరంగా మరో విచారణ ప్రభుత్వం చేసుకోవచ్చని తేలితే.. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి.