Parents walk 15 km carrying bodies of children on shoulders: సమయానికి వైద్యం అందక ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఒకేసారి ఇద్దరు పిల్లలను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అదిచాలదన్నట్లు కనీసం ఆస్పత్రి నుంచి పిల్లల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లేందుకు సౌకర్యాలు కూడా లేకపోవడం మరింత వేదనకు గురిచేసింది. దీంతో గుండెలే పలిగేలా ఏడ్చుకుంటూ కిలోమీటర్ల మేర భుజాలపై బిడ్డల మృతదేహాలను మోసుకెళ్తున్న ఆ తల్లిదండ్రుల దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. ఈ హృదయ విదారకమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అహేరి తాలుకాకు చెందిన ఇద్దరు దంపతులు తమ బిడ్డల మృతదేహాలను మోసుకెళ్తున్న వీడియోను కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టి వార్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. చివరకు మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ కూడా అందుబాటులో లేదని ఆరోపించారు.
‘10ఏళ్లు కూడా లేని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారినపడ్డారు. కానీ వారికి సకాలంలో చికిత్స అందలేదు. దీంతో ఆరోగ్యం క్షీణించడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చివరకు వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. చనిపోయిన పిల్లలను మోసుకుంటూ ఇంటికి చేరుకోవడానికి ఆ తల్లిదండ్రులు బురద నేలలో 15 కి.మీ నడవాల్సి వచ్చింది. ఈ ఘటనతో గడ్చిరోలిలోని ఆరోగ్యవ్యవస్థ దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.’ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ నేత ధర్మారావ్ బాబా ఆత్రమ్ ప్రకటనలు చేస్తున్నారని, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని విజయ్ మండిపడ్డారు.
Also Read: ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరి.. ఐసీయూలో చికిత్స
అయితే, ఆ తల్లిదండ్రులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ పోస్టుమార్టానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని, ఆ చిన్నారుల వయసు ఆరు, మూడు సంవత్సరాలని జమిల్ గుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఆరోగ్యం క్షీణించడంతో వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారని, కానీ మార్గమధ్యలోనే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం చేయాలని చెప్పినప్పటికీ..వినకుండా ఆ మృతదేహాలను తీసుకొని వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి రప్పించి పోస్టుమార్టం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.