MLC Posts: ఏపీలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. కూటమి వరుస విజయాలను అందుకుంది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీల ప్రధాన కార్యాలయాల వద్ద నాయకుల హడావుడి మొదలైంది. ఆశవాహులు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నాగబాబుకు జనసేన ద్వారా ఒక సీటు ఖరారు కాగా, తమ పరిస్థితి ఏమిటని నేతలు ప్రధాన నేతల వద్ద ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారట.
ఏపీలో కూటమి నేతలు సంబరాల్లో మునిగారు. ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటగా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది. ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖరంలు మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఓ వైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా, తమ పాలన తీరుకు ఈ గెలుపు నిలువుటద్దమని టీడీపీ క్యాడర్ అంటోంది. మొత్తం మీద కూటమి పార్టీలలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు.
ఎమ్మేల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళాయే..
ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 10 వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు సమయం ఉంది. అలాగే 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, 20 న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ 5 లో ఒకటి నాగబాబుకు ఖాయమని చెప్పవచ్చు. ఇటీవల సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీలో నాగబాబు అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబుకు సీటు ఖాయం కాగా, మొత్తం ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక కేబినెట్ హోదా ఖాయమనే చెప్పవచ్చు.
ఇక మిగిలిన 4 సీట్ల గురించి ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. అయితే పార్టీకి విధేయులుగా, పార్టీ విజయానికి దోహదపడ్డ వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన నాలుగింటిలో పిఠాపురంలో పవన్ గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరికొందరు ఆశావాహులు కూడా తమ ఉద్దేశాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారట.
Also Read: AP Schools Timings: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పాఠశాలల పనివేళల్లో మార్పు..
ఇలా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద పలువురు ఆశావాహులు, నారా లోకేష్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీ కోసం శ్రమించిన వారికి వదిలే ప్రసక్తే లేదని, ఏదొక రూపంలో పదవి వరించడం ఖాయమని టీడీపీ క్యాడర్ భావిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి వరిస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!