Murali Nayak: కాసేపట్లో అమర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. మురళీ నాయక్ కుటుంబాన్ని పరమర్శించి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేష్, మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో పోరాడుతూ.. మురళీ నాయక్ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలు కన్నారు. తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని అన్నారు.
దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నాం. చిన్నవయసులోనే అగ్నివీర్ మురళీనాయక్ చనిపోవడం బాధాకరం అంటూ లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 300 గజాల స్థలం, మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అంతేకాదు మురళి నాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అతని కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణను నమ్మలేము, కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్.. కాల్పుల విరమణ ప్రకటన చేసిన 3 గంటలకే వక్ర బుద్ధి ప్రదర్శించిందన్నారు పవన్ కళ్యాణ్, జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సహాయం ఇస్తామన్నారు.
పాకిస్థాన్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు మురళీ నాయక్. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ జమ్ము, కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా…పాకిస్థాన్ భారీ ఎదురు కాల్పులు జరపగా…యుద్ధ భూమిలోనే ప్రాణాలు కోల్పోయారు.
Also Read: జోహార్ వీరుడా.. జనం సందోహం మధ్య.. మురళి నాయక్ అంత్యక్రియలు
మురళీ నాయక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. మురళి తల్లిదండ్రులు రోదిస్తూ, విలపిస్తున్నారు. తమ ఊరికి చెందిన మురళీ నాయక్ దేశానికి చేసిన సేవల్ని తలుచుకుంటూ కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు తరలివస్తున్నారు.