Nara Lokesh: మాజీ సీఎం జగన్ చేస్తున్న పనులకు కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు. వన్ డే ఎమ్మెల్యేగా జగన్ కు కొత్త పేరు పెట్టామని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి హడావిడి చేసి బెంగళూరుకు పారిపోయిన ఘనత జగన్ కే దక్కుతుందని నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం భారీ మెజారిటీతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ లను అభినందిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ లు హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి పార్టీలు ఏకమయ్యాయని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో జనసైనికులు కూటమి విజయం కోసం పనిచేశారని, బిజెపి కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో అభ్యర్థుల విజయాలకు దోహదపడ్డారన్నారు. కూటమి గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో సహకరిస్తున్నారన్నారు. ప్రపంచ బ్యాంకును ఒప్పించి రూ. 15 వేల కోట్ల రుణాలను ఇప్పించారని సీఎం అన్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అభ్యర్థులు విజయం సాధించారని, కలిసి పనిచేస్తే కూటమికి తిరుగు ఉండదంటూ చంద్రబాబు చెప్పారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని చంద్రబాబు అన్నారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మరోమారు రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళుతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలైందన్నారు. ఎవరినైనా వదిలేస్తామన్న ఆలోచన పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంచుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షిస్తామన్నారు. ఇక జగన్ గురించి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్నారని, అందుకే ఒకరోజు అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసే బెంగళూరుకు పారిపోతున్నారంటూ విమర్శించారు.
Also Read: AP Schools Timings: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పాఠశాలల పనివేళల్లో మార్పు..
అందుకే వన్ డే ఎమ్మెల్యే అంటూ కొత్తగా జగన్‌కు నామకరణం చేశామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలను గెలిచామంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆదరణతో బాబు బ్రాండ్, మోడీ మేనియా, పవన్ కళ్యాణ్ పవర్ తో 164 సీట్లను కూటమి దక్కించుకుందంటూ లోకేష్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 9 నెలల్లో చేసి చూపించామని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా కూటమి పాలన సాగుతుందంటూ లోకేష్ అన్నారు. లోకేష్ తన ప్రసంగంలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో హర్షధ్వానాలు పలికారు. అలాగే కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆలపాటి రాజా, రాజశేఖర్ లకు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
జగన్‌కు 'వన్ డే ఎమ్మెల్యే' అని కొత్త పేరు పెట్టా: మంత్రి నారా లోకేశ్
ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం, ఒకరోజు అసెంబ్లీకి వచ్చి హడావిడి చేసి బెంగళూరు పారిపోతాడు
– మంత్రి నారా లోకేశ్ pic.twitter.com/39iCxRjiOT
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2025