ఏపీలో ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా..? అంటూ ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్. నెల్లూరు పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని జగన్ అన్నారు. ఎమర్జెన్సీ అంటూనే జగన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కదా అని అన్నారు లోకేష్. ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని భద్రత పులివెందుల ఎమ్మెల్యేకి ఇస్తున్నామని, జగన్ పర్యటనలకు పర్మిషన్లు ఇస్తూ, భద్రత కల్పిస్తున్నామని వివరించారు. పోలీసులను పెడితే ఎక్కువ మందిని పెట్టారని అంటున్నారని, పెట్టకపోతే భద్రత ఇవ్వలేదంటారని ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు లోకేష్. సీఎంగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారని చెప్పారు. పోలీసులు తమ నిబంధనల ప్రకారం పని చేస్తున్నారని, నిబంధనల మేరకే జన సమీకరణకు అనుమతిచ్చారని అన్నారు లోకేష్. ప్రభుత్వం కూడా పోలీసుల పనిలో జోక్యం చేసుకోవడం లేదన్నారు. అలా జోక్యం చేసుకునేవారమే అయితే జగన్, జనంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు.
ఏపీలో ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా..?: మంత్రి లోకేష్
ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని భద్రత పులివెందుల ఎమ్మెల్యేకి ఇస్తున్నాం
జగన్ పర్యటనలకు పర్మిషన్లు ఇస్తున్నాం, భద్రత కల్పిస్తున్నాం
పోలీసులను పెడితే ఎక్కువ మందిని పెట్టారని అంటారు.. పెట్టకపోతే భద్రత ఇవ్వలేదంటారు… pic.twitter.com/RgAVML5hjT
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025
వైసీపీ హయాంలో..
వైసీపీ హయాంలో తమపై ఎన్ని ఆంక్షలు విధించారో చెప్పారు లోకేష్. నాడు చంద్రబాబు ఇల్లు కదలకుండా గేటుకి తాళ్లు కట్టి మరీ హడావిడి చేశారన్నారు. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లాలన్నా నిరభ్యంతరంగా వెళ్లొచ్చన్నారు. తమ ప్రభుత్వం అడ్డుకోదని చెప్పారు లోకేష్. ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందని అన్నారాయన. వైసీపీ హయాంలో తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాము తట్టుకున్నామని, కూటమి పాలనలో అలాంటి తప్పులు జరగడం లేదన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగితే వెంటనే సరిదిద్దుకుంటున్నామని వివరించారు లోకేష్.
నెల్లూరులో ఏమైంది?
ఏపీలో ఇటీవల జగన్ పర్యటనల్లో ఎంత గందరగోళం ఏర్పడిందో అందరికీ తెలుసు. ఓచోట హెలికాప్టర్ డ్యామేజ్ అయింది, మరోచోట ఏకంగా ఓ ప్రాణం పోయింది. ఇక రైతుల పరామర్శలో అయితే ఓ చోట పొగాకు బేళ్లు నాశనం అయ్యాయి, మరోచోట మామిడి కాయల్ని రాజకీయం కోసం నేలపాలు చేసి ట్రాక్టర్లతో తొక్కించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేడు నెల్లూరులో పోలీసులు బందోబస్తు పెంచారు. దీంతో ఎక్కడా అవాంతరం లేకుండా జగన్ పర్యటించి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ తాము అనుకున్నంతమంది జనాలు రాలేదని వైసీపీ నేతలు హడావిడి చేశారు. జన సమీకరణకు పోలీసులు అనుమతివ్వలేదన్నారు. జగన్ కూడా ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను పర్యటనలకు వస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు జగన్. తన పర్యటన అంటేనే ప్రభుత్వం భయపడుతోందని, పోలీసుల్ని మోహరిస్తోందన్నారు.
టీడీపీ కౌంటర్..
రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు. పోలీసులు బందోబస్తు పెంచినా, తగ్గించినా రెండిటికీ వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. నెల్లూరులో పోలీసులు రూల్స్ కచ్చితంగా అమలు చేశారన్నారు. అందుకే వైసీపీ నేతలకు కడుపుమంటగా ఉందని, జనం లేకపోయే సరికి జగన్ కి కూడా అసహనం వచ్చిందన్నారు.