TDP Party: ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో చేరికల విషయంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పార్టీలో ఇక నుంచి కొత్తగా ఎవరైనా చేరాలంటే వారి వివరాలను నాయకులు కేంద్ర కార్యాలయానికి పంపించాలని, కొత్తగా చేరే వారి గురించి ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చాక.. పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటి?
తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి వారిని చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి.. పార్టీ రాష్ట్ర శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కొత్త నిబంధనలను రూపొందించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇకపై పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నా నిర్దేశిత పద్ధతులను.. కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
పార్టీలో చేరతామని ఆసక్తి చూపే వ్యక్తుల గురించి ముందుగా.. పార్టీ కేంద్ర కార్యాలయానికి తప్పనిసరిగా తెలియజేయాలని పల్లా ఆదేశించారు. వారి నేపథ్యం, వివరాలపై సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతే వారిని పార్టీలోకి ఆహ్వానించే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదని, ప్రతి చేరిక కూడా పార్టీ నియమావళికి అనుగుణంగానే జరగాలని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ.. ఈ సూచనలను తప్పకుండా పాటించాలని పల్లా శ్రీనివాసరావు తన ప్రకటనలో ఆదేశించారు. ఈ నూతన మార్గదర్శకాలతో పార్టీలోకి వచ్చేవారి విషయంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదలా ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చేరిన వారి పట్ల పలు ప్రాంతాల్లో.. స్థానిక టీడీపీ కార్యకర్తల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారంట. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నపుుడు టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు టీడీపీ చేరుతుండడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: 2029 నాటికి చంద్రబాబు అమరావతి కట్టకపోతే.. జగన్ గెలిస్తే జరగబోయేజది ఇదే!
అలాగే వివిధ కేసుల్లో ఉన్న వారు కూడా కేసుల నుంచి తప్పించుకునేందుకు టీడీపీ కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నాయకలందరూ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చారంట. మరోవైపు టీడీపీ నో ఎంట్రీ బోర్డు పెట్టిన వైసీపీ నేతలు జనసేన, బీజేపీల తలుపులు తడుతున్నారు. పలువురు సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలు ఆయా పార్టీల్లో చేరిపోతున్నారు. దానిపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో టీడీపీ కొత్త నిబంధన మిత్రపక్షాలు కూడా ఫాలో అవ్వాలని.. తెలుగుతమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
-Story By apparao, Bigtv Live