Electric Shock: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రంగపురం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వ్యవసాయ భూమిలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతుల గుర్తింపు..
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మైలవరం మండలం జంగలపల్లి గ్రామానికి చెందిన అరెేపల్లి చిన్నారావు, రెడ్డి నాగరాజులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ ప్రారంభించారు.
అనుమానాస్పద స్థితిలో దర్యాప్తు..
ఈ ఘటన ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడం వల్ల జరిగిందా..? లేక దీని వెనుక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా పోలీసులు కేసును లోతుగా పరిశీలిస్తున్నారు.
కేసు నమోదు..
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రెడ్డిగూడెం పోలీసులు, దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు, నిజానిజాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దుర్మరణం చెందడంతో జంగలపల్లి, రంగపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read:తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్