AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ గైర్హజరు కావడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారన్న ఆయన.. అందుకే సమావేశాలకు రాలేకపోయారని స్పష్టం చేశారు. మరోవైపు పవన్ మాటగా.. సభలోని జనసేన సభ్యులకు నాదెండ్ల కీలక సూచనలు చేశారు. ప్రజా సమస్యలను ప్రతీ ఒక్కరూ సభ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని.. ప్రతి చర్చలో జనసేన సభ్యులు పాల్గొనాలని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై బలమైన గొంతుక వినిపించాలన్నారు. తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలని హితవు పలికారు.
Also Read: మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లు,తక్కువ ధర.. ఊరమాస్ డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్!
సభలోని జనసేన సభ్యులు.. పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో హుందాగా, క్రమశిక్షణగా వ్యవహరించాలని నాదెండ్ల అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో తాగు, సాగునీటి సమస్యలపై సిద్ధంగా ఉండాలన్నారు. జీరో అవర్ నుంచి ప్రశ్నోత్తరాలు, చర్చల వరకు సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు. అటు శాసన మండలిలోనూ ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలని.. జనసేన సభ్యులకు నాదెండ్ల మనోహర్ సూచించారు.
అంతకుముందు శాసన మండలిలో డీఎస్సీపై ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టగా.. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాదెండ్ల మాట్లాడుతూ.. పెద్దల సభలో వైసీపీ నేతలు ఇలా నడుచుకోవడం సరికాదన్నారు. సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. డీఎస్సీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరణకు గురైనా.. వారు చర్చకు పట్టుబట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
Also Read: ఎండిపోయిన నిమ్మ తొక్కలతో దోమలకు చెక్.. 3 సింపుల్ ట్రిక్స్ ఇవిగో