Amaravati:ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఏపీ రాజధాని అమరావతిని ఒకటిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అందుకు తగ్గట్టుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి అమరావతికి ఒక రూపం తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం భవనాలు మాత్రమే కాకుండా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయం తీసుకొచ్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి మరో రైల్వే లైన్ కోసం టెండర్లను ఆహ్వానించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాలు వచ్చినా ఏ మాత్రం పనులకు ఆటంకం లేకుండా ఏర్పాటు చేశారు. కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కాకుండా వివిధ అంతర్జాతీయ కంపెనీలను అక్కడికి ఆహ్వానించారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సంస్థలకు భూములు కేటాయించడంతో శంకుస్థాపలు, నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా అమరావతి మీదుగా మరో రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం పలికింది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య రైల్వే లైన్‌లో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నాలుగో ప్యాకేజీకి టెండర్లు పిలిచింది రైల్వే శాఖ. కృష్ణా నది దాటిన తర్వాత రైల్వేలైన్ కోసం ఇప్పటికే మూడు ప్యాకేజీలకు టెంటర్లు పిలిచింది రైల్వేశాఖ. చివరిదైన ఎర్రుపాలెం- నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతంలోని వడ్డమాను నుంచి నంబూరు వరకు దాదాపు 28.35 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 599.33 కోట్ల వ్యయంతో టెండర్లకు ఆహ్వానించింది. నవంబర్ 23వ నాటికి బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. ఈపీపీ విధానంలో రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం వరకు తెలంగాణ పరిధిలో 3.5 కి.మీ. మొదటి ప్యాకేజీ టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఎంపిక చేసింది రైల్వే శాఖ పెద్దాపురం నుంచి కృష్ణానది వంతెన వరకు రెండో ప్యాకేజీ టెండరు పిలిచారు.
కృష్ణానదిపై 3.23 కి.మీ. వంతెనతోపాటు పల్నాడు జిల్లాలో వడ్డమాను వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులను మూడో ప్యాకేజీ. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 152.40 హెక్టార్ల మేరా భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయ్యాక 2, 3 ప్యాకేజీల టెండర్లు ఖరారు చేయనుంది రైల్వే విభాగం. తాజాగా వడ్డమాను నుంచి నంబూరు వరకు నాలుగో ప్యాకేజీకి టెండర్లను ఆహ్వానించింది. నాలుగు ప్యాకేజీ పరిధిలోని ఎర్రుపాలెం – అమరావతి-నంబూరు మధ్య తొమ్మిది చోట్ల రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.
ALSO READ: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన
అందులో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పరావురు ప్రాంతాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, పనులు వేగంగా పూర్తి చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది రైల్వే శాఖ.