Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రెండేళ్లు సైలెంట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దూకుడు పెంచారు. తొలుత పోలీసులను ఆయన టార్గెట్ చేశారు. అంతేకాదు కోర్టును ఆశ్రయిస్తానని తేల్చిచెప్పారు. అసలు తాడిపత్రిలో ఏం జరిగింది? పెద్దారెడ్డి మాటల వెనుక ఏం జరుగుతోంది?
తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంటి ముందు వాహనాల దాడి వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం వరకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి. ఆదివారం ఉదయం మీడియా ముందుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. జిల్లాలో అధికారులు ఉన్నారో లేదో తెలియలేదన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని, అధికార పార్టీకి కోవర్ట్‌గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇటీవల నా వాహనంపై జరిగిన దాడికి నిందితులపై చిన్న కేసు నమోదు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ వాహనం ఐదారు సార్లు తిరిగినా చిన్న కేసుతో సరి పెట్టడం దారుణమన్నారు. నిందితులను ఇంకా గుర్తించలేదని అంటున్నారని చెప్పారు. నా గన్‌మెన్‌ను ఓ సీఐ ట్రాప్ చేశారని, నాకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి లైఫ్ రిస్క్ ఉందని గన్ మెన్ ఇచ్చారని గుర్తు చేశారు.
వ్యక్తిగత వివరాలు గన్‌మెన్ ద్వారా ఎమ్మెల్యే సమాచారం తెలుసు కుంటున్నారని, మా దగ్గర ఉన్న వాళ్ళను ట్రాప్ చేశారని విమర్శించారు. మా కదలికలు నిత్యం తెలుసు కుంటున్నారని, దీనిపై కనీస విచారణ జరగలేదన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం పని చేయడం లేదని మనసులోని మాట బయటపెట్టారు. మమ్మల్ని కడతేర్చితే పోలీసులకు వచ్చే లాభం ఏంటి? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.
ALSO READ: జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?
మాజీ ఎమ్మెల్యేకు భద్రత లేకపోతే.. సాధారణ ప్రజలకు ఎక్కడ ఉంటుందని, ఫలానా సమయం వరకు రాజకీయాలు చేయొద్దని పోలీసులు మాకు చెబితే సరిపోతుందా? అంటూ నిలదీశారు. ఈ ప్రాంతానికి డీఎస్పీగా రావాలంటే పోలీసు అధికారులు వెనుకంజ వేస్తున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ చూడాలన్నారు. ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కాపాడాలని, నా ఇంటి చుట్టూ ఉన్న కెమెరాల లింక్ ఎమ్మెల్యేకు ఇస్తే ఆ సీఐపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. 20 సార్లు సీఐపై ఫిర్యాదు చేస్తే కనీసం మెమో ఇవ్వలేదని, దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు.