Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లాకి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాశ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు.
అయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ వ్యక్తి ఐపీఎస్ స్థాయి అధికారి ముసుగులో వచ్చాడని.. దీనిపై అధికారులతో మాట్లాడుతున్నాని పవన్ చెప్పారు. తనకు పని చేయడం తెలుసని.. రక్షణ ఉన్నా.. లేకపోయినా.. పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇదే ఘటనపై తాజాగా ఈ ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని నిలదీశారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. నకిలీ ఐపీఎస్ అధికారితో పోలీసులు ఫోటోలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.