
Pawan Kalyan comments on Jagan(Janasena public meeting in tadepalligudem): అనుకున్నట్టుగానే సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యారు. జగన్..జగన్ అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ.. ఘాటుగా మాట్లాడారు. జనసేన వీరమహిళలను వైసీపీ సోషల్ మీడియాలో నీచంగా తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ దిగజారిపోయాడని, నీచపు స్థాయిలో రాజకీయం చేస్తున్నారని, సంస్కారహీనుడివి నువ్ జగన్.. అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం తన భార్య విషయం పదే పదే ప్రస్తావిస్తున్నారని తప్పుబట్టారు. పెళ్లాం పెళ్లాం అంటూ మాట్లాడుతావేంటి జగన్..అంటూ శివాలెత్తారు జనసేనాని.
వాలంటీర్ల చుట్టూనే ప్రధానంగా తిరిగింది పవన్ స్పీచ్. రాష్ట్రంలో కొందరు వాలంటీర్లు చేస్తున్న ఆగడాలను, అరాచకాలను ఎండగట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లు, అమ్మాయిలపై వేధింపులు, మద్యం అక్రమ రవాణా, ప్రశ్నించిన వారిపై దాడులు.. ఇలా వాలంటీర్లలో కిరాతకులు, రాక్షసులు ఉన్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ వాలంటీర్లకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు పవన్. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వాలంటీర్ వ్యవస్థ గురించి చెబుతూ.. శివశివాణి స్కూళ్లో పేపర్లు ఎత్తుకొచ్చి..సరిగ్గా చదవని జగన్‌కు ఇవన్నీ తెలీవంటూ పంచ్‌లు వేశారు.
వాలంటీర్లు సేకరించిన ఏపీ ప్రజల డేటా అంతా హైదరాబాద్, నానక్‌రామ్‌గూడలో ఉన్న సంస్థలో ఉంచారని.. ఈ రాష్ట్ర ప్రజల సమాచారం అక్కడ ఎందుకు పెట్టావ్ జగన్ అంటూ నిలదీశారు పవన్ కల్యాణ్.
వాలంటీర్లకు కేవలం 5వేలు మాత్రమే జీతం ఇస్తూ.. ఉపాధి హామీ కూలీల కంటే తక్కువ వేతనం ఇస్తున్నారని లెక్కలు చెప్పారు. వాలంటీర్లకు రోజుకు రూ.120 జీతంగా ఇస్తూ.. వారి జీతం బూమ్‌బూమ్‌కు తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కు ఎక్కువ అన్నట్టు చేశారని మండిపడ్డారు.
రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తన సోదరీసోదర సమానులన్న పవన్ కల్యాణ్.. వారి పొట్ట కొట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని.. వారిని బ్లేమ్ చేయట్లేదని.. వాలంటీర్ వ్యవస్థ అవసరమా? అన్నదే తన ప్రశ్న అన్నారు పవన్ కల్యాణ్. తాడేపల్లిగూడెంలో జరిగిన వారాహి విజయయాత్ర సభలో.. జగన్..జగన్.. అంటూ పదే పదే పలుకుతూ తన ప్రసంగంతో హోరెత్తించారు జనసేనాని.