వాళ్లు రప్పా రప్పా అంటే తాము మెడలు కోయించుకోవడానికి సిద్ధంగా లేమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వాళ్లు కోస్తామంటే తాము మెడ చూపిస్తామా..? అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరూ అంత తేలికగా లేరని వార్నింగ్ ఇచ్చారాయన. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఆయన సూటిగా స్పందించారు. మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారన్నారు. ఆ పార్టీ చేసిన పాపం వల్లే ఏపీలో ఎంతోమంది లివర్ జబ్బులతో మరణించారని చెప్పారు. మద్యం పాలసీతో అటు నిధులు తినేశారని, ఇటు ప్రజల ప్రాణాలు తీశారని అన్నారు. వైసీపీ హయాంలో ఎంతోమంది మద్యం బాధితులు తమ పార్టీ ఆఫీస్ కి వచ్చి బాధలు చెప్పుకునేవారని, ఈరోజు ఆ పార్టీ నేతల పాపం పండి అరెస్ట్ అవుతున్నారని చెప్పారు పవన్.
నేను భయపడతానా..?
రప్ప రప్ప అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసిపారేశారు పవన్. వారు రప్ప రప్ప కోస్తామంటే తామేమీ మెడలు చూపిస్తుంటామా అని ప్రశ్నించారు. తమని రెచ్చగొట్టేందుకే వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి తాటాకు చప్పుళ్లు చాలా చూశామని, వాటికి తాను బెదిరే రకం కాదని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడి వరకు వచ్చామని, తాము ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వారి అరుపులను పట్టించుకోదని చెప్పుకొచ్చారు పవన్. తప్పులు చేసి వారు కవర్ చేసుకోవాలని చూస్తున్నారని, ఒకవేళ తమ తప్పులేదని వారు అనుకుంటే అది నిరూపించుకోవాలన్నారు.
రాజధాని భూ సమీకరణ విషయంలో పవన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయంటూ వస్తున్న వార్తల్ని సున్నితంగా తోసిపుచ్చారు పవన్ కల్యాణ్. అందర్నీ ఒప్పించి ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకెళ్తామన్నారు. రాజధాని అమరావతి కోసం భూ సమీకరణపై తన నిర్ణయాన్నిఇప్పటికే సీఎంకు చెప్పానని, వారు కూడా తన అభిప్రాయంతో ఏకీభవించారని వివరించారు పవన్. కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చెప్పారు.
నాగబాబు మంత్రి పదవిపై కూడా పవన్ స్పందించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకోడానికి సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పారన్నారు. దానికి కొంత సమయం పడుతుందని వివరించారు. తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కొంత సమయం తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. జనసేనకు కేటాయించిన శాఖల్లోనే ఒకదాన్ని ఇవ్వాల్సి ఉంటుందని, తాను త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను ఎవరికీ భయపడి పార్టీని నడపడం లేదని, ఎవరి కోసమో తాను నిర్ణయం తీసుకోనన్నారు. పార్టీ నియమావళిని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ఆ నియమాల్ని పాటించాల్సిందేనన్నారు. పార్టీలో కొంతమందిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల గురించి కూడా ఆయన క్లుప్తంగా వివరించారు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే వెంటనే వేటు వేయడం లేదని, వారికి అవకాశం ఇస్తున్నామన్నారు. పార్టీకి ఇబ్బంది కరంగా ప్రవర్తిస్తూ నష్టం చేకూర్చాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పవన్.