Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, యువతకు మేలు చేకూరనుంది. వేసవి నీటి ఎద్దడి సవాళ్లను అధిగమించేందుకు పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. గౌరవ వేతనంతో కూడిన ఉపాధి సైతం యువతకు చేరువ కానుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏమిటి? అసలు ఎలా మేలు చేకూరనుందో తెలుసుకుందాం.
రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్యలను అధిగమించేందుకు ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్, అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు.
అవగాహన అవసరం..
త్రాగునీటి నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పవన్ అన్నారు. నీటి సంరక్షణ పట్ల ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. త్రాగు నీటి సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక వాటర్ వార్ రూమ్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోజువారీ నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. ఒక్క చుక్క వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వర్షపునీటి సేకరణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.
శుద్ధమైన నీటిని అందించాలి
ఇంటింటికీ, కమ్యూనిటి భవనాలకు వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తాగు నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం నీటి నిల్వను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఫిల్టర్ బెడ్లను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేసి శుద్ధమైన నీటిని ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పని చేస్తున్నాయా.? లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించాలని ఆదేశించారు.
గౌరవ వేతనాలు ఇవ్వండి
నీటి పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలని పవన్ అన్నారు. ప్రకృతి నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో విద్యార్థులకు, యువతకు నీటి సంరక్షణ అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేసే విధంగా ప్రణాళికలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి వేసవి ఇంటర్న్ షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.
Also Read: Food Items In Amaravati: ఇదేం మెనూ బాబోయ్.. అమరావతిలో ఏర్పాట్లు అదరహో..
నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలో యువత సహకారం తీసుకోవాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైతే నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేసేలా, గ్రామ స్థాయిలో నీటి ప్రణాళికలను సిద్ధం చేయాలని సమీక్షలో పవన్ అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని, గ్రామ గ్రామానికి ప్రత్యేకమైన సమగ్ర తాగునీటి ప్రణాళిక రూపొందించాలన్నారు.