Pawan Kalyan Satires on CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం తాము సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని, తామూ నేటి జాబితాతో యుద్ధానికి రణభేరి మోగించామని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఈ పొత్తుకు ముందుకొచ్చామని ఆయన ప్రకటించారు.
చాలా మంది జనసేన 60 లేదా 70 సీట్లు కోరాలని తనకు సూచించారనీ, కానీ.. గత ఎన్నికల్లో కనీసం తమ పార్టీ 10 సీట్లైనా గెలిచి ఉంటే.. తాను అలా అడగగలిగే వాడినని తెలిపారు. ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదనీ, తాము తీసుకున్న సీట్లలో టీడీపీ, జనసేన పార్టీలు అదిరిపోయే రిజల్ట్ చూపించాల్సి ఉందన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో జనసేన కొంత సర్దుకుపోయే ధోరణిని అనుసరించిందని వివరించారు.
జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. అలాగే.. టీడీపీ ఉన్నచోట ప్రతి జనసేన ఓటు టీడీపీకి, జనసేన బరిలో నిలిచిన స్థానాల్లో ప్రతి టీడీపీ ఓటు జనసేనకు బదిలీ అయితేనే.. ఈ పొత్తు ఫలిస్తుందని, ఈ క్షణం నుంచి రెండు పార్టీల కార్యకర్తలు అదే పనిలో ఉండాలని సూచించారు.