ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. గతంలో కూడా మోదీ ఏపీకి వచ్చినా.. ఈసారి మాత్రం ఇది స్పెషల్ టూర్. అమరావతి పునర్నిర్మాణం కోసం ఆయన ఈసారి ఏపీకి వస్తున్నారు. 2014లో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇలాగే అమరావతి నిర్మాణం కోసం ఆయన వచ్చి వెళ్లారు. ఇప్పుడు రెండోసారి పునర్నిర్మాణం అంటూ రాబోతున్నారు. మే నెల 2 వతేదీ మోదీ ఏపీకి వస్తారు. అమరావతిలో ఆయన బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ వేదికపైనుంచి ఆయన అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తారు.
బీజేపీలో ఉత్సాహం
మే 2వతేదీ సాయంత్రం 4 గంటలకు అమరావతిలో ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తారు. ఈ సభలో ఆయనతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ సహా ఇతర కీలక నేతలు ఉంటారు. కూటమి ప్రతినిధిగా ప్రధాని వస్తున్నారు కాబట్టి.. మూడు పార్టీల నేతలకు అక్కడ ప్రయారిటీ ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ ఈ పర్యటనను మరింత గట్టిగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది.
సచివాలయం వెనక సభా వేదిక
మోదీ సభ కోసం వెలగపూడిలో ఏపీ సచివాలయం వెనక ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడి నుంచే అన్ని పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ఇదివరకే కూటమి ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది.
నెగెటివ్ సెంటిమెంట్..
ప్రధాని మోదీ అమరావతి పర్యటన అనగానే.. చాలామందికి గతం గుర్తుకు రావొచ్చు. గతంలో అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా ఆయనే. అయితే కేంద్రం నుంచి నిధులు తెస్తారని ప్రజలు ఆశిస్తే.. ఆయన పవిత్ర జలం, మట్టి అంటూ సెంటిమెంట్ తో సరిపెట్టారు. ఆ తర్వాత నిధులు లేక అమరావతి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పునర్నిర్మాణానికి వస్తున్నారంటే మరోసారి ఆయన ఏం తెస్తారు, ఏం ఇస్తారనే విషయం చర్చకు వస్తోంది. ఇప్పటి వరకు అమరావతి నిధుల విషయంలో కేంద్రం ఉదారంగా ఉంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానికి కేంద్రం మరిన్ని వరాలు ఇస్తుందేమో చూడాలి.
ప్రతిపక్షం సైలెన్స్..
మోదీ ఏపీ పర్యటనపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైలెంట్ గా ఉంది. అటు మోదీని విమర్శించలేరు, అలాగని అమరావతి పునర్నిర్మాణ పనుల్ని వారు స్వాగతించలేరు. అందుకే జగన్ సహా కీలక నేతలంతా మోదీ పర్యటన గురించి తెలియనట్టే ఉన్నారు. వక్ఫ్ బిల్లుపై ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలంతా రేపు మోదీ పర్యటన సందర్భంగా కనీసం గొంతెత్తే అవకాశం ఉందా అని సెటైర్లు పడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఇదే విషయంలో కూటమిని ఇరుకున పెడుతున్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటిపోయినా ఇంకా ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం మోదీ, చంద్రబాబు, జగన్ అని దుయ్యబట్టారామె. ఈసారయినా మోదీ అమరావతి నిర్మాణానికి చిత్తశుద్ధితో నిధులివ్వాలని డిమాండ్ చేశారు.