Mohana Krishna Indraganti: కొన్నిసార్లు దర్శకులు తమ సినిమా బాధ్యతలను పూర్తిగా అసిస్టెంట్స్‌కే అప్పగిస్తారు. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. చాలావరకు ఆయన అసిస్టెంట్స్‌ను నమ్మి దర్శకత్వ పర్యవేక్షణతోనే ముగించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఎంతోమంది దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఒకరు. కానీ రామ్ గోపాల్ వర్మకు, ఇంద్రగంటి మోహనకృష్ణకు కెరీర్ మొదట్లోనే విభేదాలు వచ్చాయి. దానిపై ఇంద్రగంటి తాజాగా క్లారిటీ ఇచ్చారు.
మొదటి ఆఫర్
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వ పర్యవేక్షణలో ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohana Krishna Indraganti) ‘మధ్యాహ్నం హత్య’ అనే ఒక సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా అంతా పూర్తయిన తర్వాత రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఆర్జీవీ, ఇంద్రగంటి మళ్లీ ఎప్పుడూ కలిసి పని కూడా చేయలేదు. అసలు అలా ఎందుకు జరిగిందో తాజాగా క్లారిటీ ఇచ్చారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘నేను 2003లో చలి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ఒకే కథతో తెలుగులో, హిందీలో సినిమాలు చేస్తూ ఉన్నారు. అలా తెలుగులో మధ్యాహ్నం హత్య, హిందీలో మై వైఫ్స్ మర్డర్ అని సినిమా అనుకున్నారు. చలి షార్ట్ ఫిల్మ్ చూశాను బాగుంది అంటూ మధ్యాహ్నం కథను తెరకెక్కించడానికి నాకు ఆఫర్ ఇచ్చారు’’ అని గుర్తుచేసుకున్నారు ఇంద్రగంటి.
జోక్యం చేసుకోలేదు
‘‘మధ్యాహ్నం హత్య నేను చేస్తున్నంత వరకు రామ్ గోపాల్ వర్మ అస్సలు జోక్యం చేసుకోలేదు. ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయనకు నచ్చలేదు. నేను అనుకున్నట్టు లేదు అన్నారు. నేను కూడా షాకయ్యాను. మధ్యాహ్నం హత్యను వేరే వాళ్లు డైరెక్ట్ చేస్తారు, కావాలంటే నువ్వు కంటిన్యూ అవ్వొచ్చు అన్నారు. నేను డైరెక్ట్ చేయనప్పుడు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనుకొని వచ్చేశాను. అది చాలా పెద్ద దెబ్బ. కానీ ఆర్జీవీ చాలా బాగా డీల్ చేశారు. నేను నీ టాలెంట్‌ను జడ్జ్ చేయట్లేదు, నేను నిన్ను పూర్తిగా నమ్మాను. స్వేచ్ఛ ఇచ్చాను, నేను అనుకున్నట్టు సినిమా రాలేదు అని ఆయన క్లియర్‌గా చెప్పారు. అలా మాట్లాడినా కూడా దెబ్బ దెబ్బే కాబట్టి దాని నుండి బయటికి రావడానికి దాదాపు నెలరోజులు పట్టింది’’ అని చెప్పుకొచ్చారు ఇంద్రగంటి.
Also Read: త్వరలో లవ్ స్టోరీ మూవీ.. నిబ్బా నిబ్బి కాన్సెప్ట్
మనుషులు మారతారు
‘‘అప్పట్లో నేను అభిమానించే అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయన టాప్ స్థానంలో ఉండేవారు. కానీ మనుషులు మారుతుంటారు కదా. ఎవరి ఛాయిస్‌లు వాళ్లవి. ఒక ఫిల్మ్ మేకర్‌గా ఆయన సినిమాలు చూడడం మానేశాను. ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం లేదు. ఒక ఫిల్మ్ మేకర్‌గా ఆయన స్థానం ఎప్పుడూ అక్కడే ఉంటుంది’’ అంటూ రామ్ గోపాల్ వర్మపై అభిమానాన్ని బయటపెట్టారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ తర్వాత తను డైరెక్టర్‌గా ‘గ్రహణం’ అనే సినిమా తెరకెక్కించి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నప్పుడు తనకు మొదటి ఫోన్ కాల్ రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ నుండే వచ్చిందని తెలిపారు. ఇష్టపూర్వకంగానే ఆర్జీవీతో ఆయన విడాకులు తీసుకున్నానంటూ నవ్వారు.