PM Modi – Nara Lokesh: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా కీలకంగా మారింది.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోదీతో లోకేష్ దంపతులు ఆత్మీయంగా సంభాషించారు. దేశాభివృద్ధి దిశగా ప్రధాని చేస్తున్న కృషికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా, 2047 నాటికి వికసించిన భారత్ దిశగా దేశం నడిపించడంలో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మార్గదర్శకత్వం అవసరమని, రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత మద్దతు అందాలన్న అభిప్రాయాన్ని లోకేష్ వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఒక ప్రత్యేక ఘటన మరింత ఆకర్షణీయంగా మారింది. 2024 ఎన్నికల కంటే ముందు నారా లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర ఆధారంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘యువగళం’ తొలి కాపీని ప్రధాని మోదీ స్వయంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం లోకేష్ పాదయాత్ర సమయంలో ప్రజలతో కలిసి గడిపిన క్షణాలు, అనుభవాలు, రాష్ట్రం కోసం ఆయన కలలు, ప్రభుత్వంపై ఉన్న ప్రజల ఆశలు – అన్నింటినీ స్పష్టంగా వివరిస్తోంది.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ, తన సంతకం చేసి లోకేష్‌కు ప్రత్యేకంగా అందించారు. మోదీ అందించిన ఆశీస్సులను ఎన్నటికీ మరువలేనని లోకేష్ అన్నారు.
వీరి సంభాషణలో ప్రధానంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన, అభివృద్ధి, వృద్ధి లక్ష్యాలపై ప్రధాన చర్చ సాగింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని, ఇందులో ప్రధాని మద్దతు ముఖ్యం అని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఏపీ దేశానికే మార్గదర్శిగా నిలవగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: Vande Bharat Trains: వందే భారత్ కొత్త మార్గాలు.. మీ ప్రాంతం ఈ జాబితాలో ఉందా?
లోకేష్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ను కూడా ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించటం ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశం ద్వారా మోదీ – లోకేష్ మధ్య ఉన్న అనుబంధం, రాజకీయ సంబంధాలకు మించి వ్యక్తిగత మైత్రి కూడా ఉందనే సందేశం బయటికి వచ్చిందని చెప్పవచ్చు. మోదీ ఆశీస్సులతో, మార్గదర్శకత్వంతో లోకేష్ ముందుకెళ్తే, రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత మద్దతు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మోడీ ఏపీకి వచ్చిన సమయంలో లోకేష్ ను కుటుంబంతో సహా విందుకు రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ ఆహ్వానం మేరకు లోకేష్ మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారు.