Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. కీసర టోల్‌ప్లాజా దగ్గర ప్రమాదానికి గురయ్యారని, విజయవాడ చేరుకునే సరికి బాగా అలసిపోయి కనిపించారని పోలీసులు చెప్తున్నారు. అటు.. పాస్టర్ల కమ్యూనిటీని మాత్రం అనుమానాలు వీడలేదు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన పోస్టులు పడుతున్నాయి. అసలు వాస్తవం ఏంటో కనుక్కొనేందుకు బిగ్‌టీవీ రంగంలోకి దిగింది. పాస్టర్ కేసులో తాజాగా మరో సీసీటీవి బయటకు వచ్చింది.
పాస్టర్ ప్రవీణ్‌ను దారి పొడవునా మృత్యువు వెంటాడింది. విజయవాడ చేరుకునేలోపే రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారాయన. చిల్లకల్లు టోల్ ప్లాజాకు ముందు.. తృటిలో బయటపడ్డ ప్రవీణ్.. జగ్గయ్యపేట దగ్గర హైవేపై బారికేడ్లను క్రాస్ చేసేటప్పుడు లారీ పక్కనే అదుపు తప్పి పడిపోయారు. లారీ చక్రాల కింద పడకుండా వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు.
జగ్గయ్యపేట దగ్గర జాతీయ రహదారిపై పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు. ఓ లారీ టైర్ల కింద నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఆ వెనకే.. ఆర్టీసీ బస్సు వస్తుండగా.. ఆ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బస్సును రోడ్డుకు మరోవైపు తీసుకెళ్లడంతో ప్రవీణ్ అక్కడ సేఫ్‌గా బయటపడ్డారు.
కీసర టోల్‌గేట్ దగ్గర మరోసారి అదుపు తప్పి గోడను ఢీకొట్టారు ప్రవీణ్. విజయవాడ రింగు రోడ్డు దగ్గరా పడిపోయారాయన. అలా.. మూడు సార్లు ప్రాణాపాయం తప్పించుకున్నా.. ముప్పును గుర్తించలేకపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది. చివరకు రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన.. గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్టు.. విజయవాడలోనే ఆగిపోయి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పాస్టర్ల సంఘాల నేతలు హోంమంత్రిని కలిశారు. మృతి కేసులో విచారణను వేగవంతం చేయాలని కోరారు. పాస్టర్ మృతికి న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే పోస్టుమార్టం నివేదిక వస్తుంది. రాగానే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు హోంమంత్రి అనిత. పాస్టర్‌లు అంటే తమకు చాలా గౌరవం. కొందరు స్వార్ధపరులు పాస్టర్ మృతిని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. దాంట్లో మీరు పావులు కావొద్దు అన్నారు హోమ్ మంత్రి. పాస్టర్ మృతి కేసును పోలీసులతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తు, పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Also Read: అప్పుడు వివేకా.. ఇప్పుడు పాస్టర్.. మీరు మారరా ఇక?
ఇక ఇదే కేసులో మాజీ ఎంపీ హర్ష కుమార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలున్నాయని.. ఆయన గురై ఉంటాడని హర్ష కుమార్ ఆరోపించారు. దీంతో రాజానగరం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదయింది. పాస్టర్ మృతిపై ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని హర్ష కుమార్‌ను పోలీసులు గతంలో కోరారు. అయితే మరోసారి ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీసీ ఫుటేజ్ లేదా సీడీ రికార్డ్ ఉంటే ఇవ్వాలని కోరారు. హర్ష కుమార్ కూడా పోలీసులకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను సమాచారం ఇవ్వడం కాదని.. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం తానే కొన్ని ప్రశ్నలు అడుగతానని అన్నారు.