Rajahmundry Elections: ఏడేళ్లుగా ఎన్నికలు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూశారు. ఇపుడు ఎన్నికల నగారా మోగడానికి ముహూర్తం ఖరారైన వేళ అలా ఎదురు చూసిన వారే ఒక్కసారిగా డీలా పడిపోయారు. మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని కలలు కన్న ఆశావహులు రిజర్వేషన్ల ఖరారుతో అమాంతం సైలెంట్ అయిపోయారు. వారిని బుజ్జగించి ఎన్నికల్లో విజయానికి కృషి చేసేలా చేయడానికి ఇక పార్టీల నాయకత్వాలు కొత్త తాయిలాలు ప్రకటించాల్సి ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తల్ల కిందులైన ఆశావహుల లెక్కలపై స్పెషల్ స్టోరీ.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఏడేళ్ల తర్వాత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో కూటమి పక్షాల నేతల ఫోకస్ అంతా ఈ ఎన్నికపైనే ఉంది. ప్రత్యేకించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోడానికి కీలక నేతలంతా తమ తమ స్థాయిల్లో పైరవీలు చేసుకుంటూ వచ్చారు. అయితే సడెన్ గా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో వీరంతా షాక్ తిన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎస్సీ జనరల్ కేటగిరీగా ప్రకటించారు అధికారులు. దీంతో మేయర్ పదవి ఆశించిన వారు సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు. ఇపుడు జనాదరణ ఉన్న ఎస్సీ జనరల్ అభ్యర్ధుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వారిలో కొందరయితే తమకు ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి తమ చెప్పు చేతల్లో ఉండే ఎస్సీ జనరల్ అభ్యర్ధి కోసం వెతుకుతున్నారట. వారికే టికెట్ ఇప్పించుకుంటే కార్పొరేషన్ ని పరోక్షంగానైనా పాలించ వచ్చునని వారు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
50 మంది కార్పొరేటర్లు ఉండే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తగా 11 గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో డివిజన్ల సంఖ్య 70 దాకా పెరిగే అవకాశం ఉంది. లోకల్ ఎలక్షన్స్ లో మొత్తం క్లీన స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది కూటమి. ఈ నేపథ్యంలో రాజమండ్రి కార్పొరేషన్ లో ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టకూడదన్న పంతంతో కూటమి నేతలు ఉన్నారు.ఏడేళ్లుగా ఎన్నికైన కార్పొరేటర్లు లేకపోవడంతో కార్పొరేషన్ లో పేరుకు పోయిన సమస్యలపై ప్రజలు ఎవరిని అడగాలో తెలీని పరిస్థితి. అధికారులను తిట్టుకుంటూ ఉండిపోయారు. ఇపుడిక ప్రజలుఎన్నుకునే పాలకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల పట్ల ఆసక్తి పెరిగింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నామ మాత్రపు పోటీ అయినా ఇస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Also read: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వాయిదా.. అక్టోబర్ 15 నుంచి కాదు, దీపావళి తర్వాతే