Rammohan Naidu: బిసి రిజర్వేషన్ల సాధన అనేది కవలం ఎన్నికల రాజకీయాలకు సంబంధించిన అంశం ఎంతమాత్రమూ కాదు. ఇది కోట్లాది మంది బిసిల భవిష్యత్తుకు, సామాజిక న్యాయానికి సంబంధించిన కీలకమైన అంశం అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి.
సుప్రీంకోర్టు తలుపు తట్టిన కూటమి ప్రభుత్వం..
బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ల కల్పన కోసం సుప్రీంకోర్టులో స్పష్టమైన అవకాశం ఉండటం వల్లే తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని మంత్రి వెల్లడించారు. ఈ సమస్యను మరింత జటిలం చేయకుండా, చట్టపరంగా శాశ్వత పరిష్కారం సాధించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా బిసి రిజర్వేషన్లకు చట్ట భద్రత కల్పించేందుకు వీటిని షెడ్యూల్ 9 లో చేర్చే అంశంపై దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తుచేశారు.
వైసీపీ వైఖరిపై నిరసన..
తాము బిసిలకు న్యాయం చేయాలని సర్వశక్తులూ ఒడ్డుతుంటే.. బిసిలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ‘బిసీల పట్ల వైసీపీకి ఎందుకంత కక్ష..?’ అని ఆయన నేరుగా ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒక బిసి నాయుకుడిని కేంద్రమంత్రిని చేసి ఈ వర్గాల పట్ల ఉన్న ఆదరణను నిరూపించుకున్నారని చెప్పారు.
16,800 పోస్టుల భవిష్యత్తు..
ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే దాదాపు 16,800 పోస్టులు బిసి నిరుద్యోగ యువతకు దక్కుతాయని, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిసిలకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం తాము చివరివరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!