Saraswati Power Industries: మాజీ సీఎం జగన్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. సరస్వతి పరిశ్రమల భూముల విషయంలో ఆయనకు కష్టాలు వెంటాడుతున్నాయి. అసైన్ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు తేలింది. దీనిపై సరస్వతి యాజమాన్యం.. ఇటు రైతులు.. అటు మధ్యవర్తులపై వివరణ కోరుతూ రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మాజీ సీఎం జగన్, ఆయన ఫ్యామిలీ సభ్యులకు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి పల్నాడు రెవిన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. సరస్వతి పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూముల్లో 20 ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు అధికారులు గుర్తించారు.
అసలు ఆ భూములు ఎవరివి? సరస్వతి పవర్ కంపెనీకి ఏ విధంగా ఇచ్చారు? అనేదానిని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇటు సరస్వతి పవర్ కంపెనీ.. అటు మధ్యవర్తిగా ఉన్నవారికి, ఇటు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే పట్టాలు రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.
ఇటు సరస్వతి యాజమాన్యం, అటు కొనుగోలు దారులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు ఇచ్చిందని సమాచారం. పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన దాదాపు 30 మంది ఎస్సీ రైతులు, దాచేపల్లి మండనానికి చెందని ఓ వ్యక్తికి అసైన్డ్ భూములను అమ్మారు. ఆ వ్యక్తి.. కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తికి వాటిని అమ్మినట్టు తేలింది. కడప వ్యక్తి నుంచి సరస్వతి పవర్ కంపెనీ భూములను కొనుగోలు చేసిందట.
ALSO READ: 18న టీటీడీ అధ్వర్యంలో కార్తీక దీపోత్సవం.. భారీ ఏర్పాట్లు.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
ప్రభుత్వం ఇచ్చిన భూములను సరస్వతి ప్లాంట్‌కు ఎలా ఇచ్చారు? ఆ భూములను యాజమాన్యం ఏ విధంగా కొనుగోలు చేసింది? అనే దానిపై పూర్తి స్థాయిలో విచారించనున్నారు అధికారులు. మొన్నటికి మొన్న మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్, సరస్వతి భూముల్లో ఎక్కడా ప్రభుత్వ భూమి లేదన్నారు.
10 రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పల్నాడులో పర్యటించారు. సరస్వతి భూముల్లో అటవీ, రెవిన్యూ భూములపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. దీని ఆధారంగా అధికారులు నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.