RK Roja: వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని ఆరోపిస్తూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.హోంమంత్రి అనిత, మంత్రి సవితపై కూడా రోజా మండిపడ్డారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తిప్పికొట్టారు.
చంద్రబాబు నాయుడు నిజాయితీ లేకుండా రాజకీయాలు చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. మంత్రులకు అబద్ధాలు చెప్పే మందు చంద్రబాబు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైందని ఎద్దేవా చేశారు.
రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు వంటి చోట్ల మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో నిర్మించబడ్డాయని రోజా గుర్తు చేశారు. నువ్వు వస్తావా హోంమంత్రి? ఈ కాలేజీల్లో విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో చూపిస్తాను అంటూ రోజా సవాల్ విసిరారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం ప్రారంభమైన కాలేజీలను.. ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రజలను.. మోసం చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు–పవన్ కలయికతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కేవలం ప్రచార హంగామా మాత్రమే జరుగుతోందని ఆమె ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితోనే పేదలకు.. మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీలను నిర్మించారని రోజా గుర్తు చేశారు. అనంతపురంలో వైఎస్ జగన్ ఆస్పత్రిని నిర్మించడం కూడా దీనికి నిదర్శనమని ఆమె అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు గిట్టుబాటు చేసే వైద్యం అందించడంలో విఫలమైందని రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు నిలిచిపోవడం రాష్ట్ర ప్రజలకు నష్టమని ఆమె పేర్కొన్నారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడంలేదు? అని నిలదీశారు.
హోంమంత్రి అనితకు చంద్రబాబు తయారు చేసిన ఫేక్ వీడియోలను.. చూపించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రోజా ఆరోపించారు. నిజాయితీగా అభివృద్ధి చేసిన వైసీపీ పాలనను దాచిపెట్టి, అబద్ధాలతో ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
ఆర్కే రోజా చేసిన విమర్శలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని రగిలించాయి. మెడికల్ కాలేజీలు ఎవరు నిర్మించారు? ఎవరు నిర్వీర్యం చేస్తున్నారు? అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ రంగ అభివృద్ధి కొనసాగుతుందా? లేక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో తేలనుంది.