Collector Swapnil Dinkar: స్వప్నిల్ దినకర్ ఐఏఎస్.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. ప్రచారానికి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే అధికారిగా గుర్తింపు పొందిన ఈయన.. 2024 జులై 4న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ జిల్లాపై తన మార్క్ వేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్.
కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ పనితీరు
ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది కదా.. ఏదో మామూలుగా ఉద్యోగం చేసేద్దాం అని కాకుండా.. పాలనలో జిల్లాపై తనదైన ముద్ర వేసేందుకు నిరంతరం తపించే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు స్వప్నిల్ దినకర్. ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే.. ఆ ఒక్కరోజే ప్రజల సమస్యలు తెలుసుకోవడం పూర్తిగా సాధ్యం కాదని భావించిన ఆయన.. ఆ తర్వాత వారంలో ఎప్పుడైనా ప్రజలు తనను కలిసేందుకు అవకాశం కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ నిర్ణయం అత్యంత కీలకమైందని చెబుతారు జిల్లా ప్రజలు.
కలెక్టర్ వినూత్న కార్యక్రమాలు
సాధారణంగా ప్రభుత్వ అధికారి అంటే.. ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే.. స్వప్నిల్ దినకర్ మాత్రం సర్కారు గైడ్ లైన్స్‌కు లోబడే ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువగా ఏదైనా చేయాలని ఆలోచించే అధికారి. ఇందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమంలో 500 కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగు పరిచారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో మరే జిల్లా వినియోగించుకోనంతగా ప్రభుత్వ నిధులను జిల్లా కోసం ఖర్చు చేశారాయన. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలోనూ ఇదే తీరు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పనులు చేసి చేతులు దులుపుకోలేదు కలెక్టర్ దినకర్. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా పారిశ్రామిక వేత్తల నుంచి నిధులను సేకరించి పట్టణాలు క్లీన్‌గా ఉంచడానికి ప్రయత్నం చేశారు. జిల్లాలోని పలాస లాంటి ప్రాంతాల్లో డస్ట్ బిన్స్ ఏర్పాటు, పార్కులను అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలు ఇందులో భాగంగానే జరిగాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రలో శ్రీకాకుళానికి వచ్చిన అవార్డు కూడా కలెక్టర్ కృషికి ప్రతిఫలమేనని చెప్పాలి. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసేందుకు రోజుకు 20 గంటలపాటు శ్రమించారు స్వప్నిల్ దినకర్.
ప్రజలతో సత్సంబంధాలు
ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి ముందు ఉంటారు కలెక్టర్ దినకర్. ఇందులో భాగంగానే కలెక్టరేట్‌లో తనను కలిసేందుకు ప్రజలకు విస్తృతస్థాయిలో అవకాశం కల్పించారాయన. ప్రజలతో ఎంతగా మమేకమైతే, ఎంత దగ్గరగా ఉంటే వారి సమస్యలను అంతగా పరిష్కరించే వీలు కలుగుతుందన్నది ఆయన ఆలోచన. ఎక్కడిదాకో ఎందుకు ఎవరైనా పేషెంట్‌కు ఆస్పత్రిలో బెడ్ లేదని తన దృష్టికి తీసుకువస్తే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తారు కలెక్టర్. చివరకు బ్లడ్ కావాల్సి వచ్చినా చాలా సార్లు సొంత ఖర్చులతో అరేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతుంటారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఐసీడీఎస్ పంపిణీ చేస్తున్న ఆహారంతోపాటు ఆయన సొంత నిధులు వెచ్చించి మరీ ఖర్చు చేస్తుంటారన్న పేరు తెచ్చుకున్నారు కలెక్టర్.
ప్రధాన రంగాలపై కలెక్టర్ ఫోకస్
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొన్ని ప్రధాన రంగాలపై ఫోకస్ చేశారు స్వప్నిల్ దినకర్. ప్రజారోగ్యం, ప్రాథమిక విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధికి, మార్పులకు విశేషంగా కృషి చేస్తున్నారాయన. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు ఉండాలన్నది కలెక్టర్ ఆలోచన. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు వెనుకాడరు స్వప్నిల్ దినకర్. వ్యవసాయ రంగంలో ఉండే సమస్యలపైనా గట్టిగానే దృష్టి సారించారాయన. అన్నదాతలు సంప్రదాయ వ్యవసాయానికే పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలని చెబుతారు. ఇందులో భాగంగా వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన ఆయన.. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇవన్నీ బాగానే ఉన్నా…
ఇవన్నీ బాగానే ఉన్నా.. ఫైళ్ల క్లియరెన్స్‌లో మాత్రం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెనుకంజలో ఉన్నారనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 60 శాఖల్లో కేవలం 15 విభాగాలు మాత్రమే ఆయన విజన్‌కు అనుగుణంగా స్పీడుగా పనిచేస్తున్నాయని, మిగిలినవి చాలా వెనుకబడి ఉన్నాయని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌కు, కిందిస్థాయి అధికారులకు మధ్య ఉన్న గ్యాప్ వల్లే ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం అవుతోందన్న టాక్ విన్పిస్తోంది. ఇదే సమయంలో రాజకీయ నాయకుల సిఫార్సులకు ఆయన పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలూ విన్పిస్తున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం కావడానికి ఇది కూడా ఓ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: HYDRA: ఇది హైడ్రా గొప్పదనం.. ఒక్క ఏడాదిలోనే 500 ఎకరాలు, 20 చెరువులు..!
ALSO READ: Intelligence Bureau: సూపర్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..