Stree Shakti Updates: ఏపీలో ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇకపై గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చని అధికారులు వెల్లడించారు.దీంతో మహిళల్లో ఆనందం అంతా ఇంతా కాదు.
ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని ఐదు రకాల బస్సుల్లో ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిలో గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటిలో మహిళల ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్ బుకింగ్ బస్సులు అంటే ఏంటి? అక్కడికే వచ్చేద్దాం.
కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా కేవలం రెండు లేదా మూడు ప్రాంతాలకు నడుపుతున్నారు. అలాంటి బస్సులకు ఆయా బస్టాండ్‌లో టికెట్లు జారీ చేస్తారు. దాన్ని గ్రౌండ్ బుకింగ్ అంటారు. ఇకపై ఆయా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నమాట.
గ్రామీణ ప్రాంతాలకు నడిచే సాధారణ బస్సులు పల్లె వెలుగు బస్సులున్నాయి. వేగంగా గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే సర్వీసులు అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. వీటితోపాటు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ముఖ్యమైన పట్టణాలు-నగరాల మధ్య నడిచే బస్సులు.
ALSO READ: ఇంటర్ విద్యలో మార్పులు.. ఫిబ్రవరిలో పరీక్షలు
ఇక సిటీ పరిధిలోకి వస్తే నగరంలో నడిచే బస్సులు, సింహాచలం కొండపైకి వెళ్లే బస్సులు సహా రాష్ట్ర మంతటా 39 ఘాట్ రోడ్లపై నడిచే బస్సులు ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ బస్సులు అందులో చేరిపోయాయి. ఇటీవల RTC అధికారులు ఘాట్ రోడ్డులో టోల్ ఫీజు మినహాయింపు కోసం దేవస్థానం ఈవోకు ఓ లేఖ రాశారు. దానికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు టికెట్లు లేకుండా ఉచితంగా సిటీకి చేరుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా మహిళలకు రూ.1500 ఆదా అవుతుందని అంచనా వేస్తోంది ఆర్టీసీ విభాగం. గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో సదుపాయం కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.