SVSN Varma on Nara Lokesh: టీడీపీలో ఏం జరుగుతోంది? లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని నేతలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? రోజురోజుకూ ఈ వాయిస్ ఎందుకు పెరుగుతోంది? వెనుక ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? ఇదే చర్చ ఏపీలో టీడీపీలో మొదలైంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా కూటమి ముఖ్యనేతలు తొలుత చర్చించుకుంటారు. ఆ తర్వాత బీజేపీ పెద్దల వరకు వెళ్తుంది. మంచి.. చెడు అన్న కోణాల్లో ఆలోచించిన తర్వాత పదవులు కేటాయిస్తున్నట్లు నేతల్లో చిన్నపాటి చర్చ లేకపోలేదు. అయితే గడిచిన మూడు రోజులుగా ఏపీ అధికార పార్టీలో రీసౌండ్ మొదలైంది.
అదేంటంటే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్నది నేతల ప్రధాన కోరిక. ఆ విధంగా కొందరు తమ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. శనివారం సీఎం చంద్రబాబు కడప జిల్లా టూర్‌లో రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వంతైంది. ఇందులో తప్పేముందన్నది మరికొందరి వాయిస్. దీన్ని వ్యతిరేకించినవాళ్లూ లేకపోలేదు.
రేపటి రోజున చంద్రబాబు తర్వాత లోకేష్‌కే ఆ ఛాన్స్ వస్తుందని, ఇందులో కంగారు పడడం ఎందుకని అంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ నడిపిస్తున్న అధినేత చంద్రబాబుకు ఆ విషయం తెలీదా అని చెబుతున్నారు. ఎప్పుడు, ఏం చెయ్యాలో పెద్దాయనకు అంతా తెలుసని అంటున్నారు.
ALSO READ: విజయవాడలో ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ.. కొందరికి క్లాస్, మరికొందరికి మాస్ వార్నింగ్?
ఇంతకీ వర్మ ఏమన్నారు ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం. పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అందులో తప్పేముందని అన్నారు. పార్టీలు మనుగడ సాధించాలన్నా, బలపడాలన్న కార్యకర్తల మాట పార్టీ అధినేత వినాలన్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుముకగా నడిచింది లోకేష్ అని గుర్తు చేశారు.
సభ్యత్వాల నమోదు ద్వారా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అందాలన్నది యువనేత ప్రతిపాదన. ఇదే కాన్సెప్ట్‌ను మిగతా పార్టీలు అనుసరిస్తున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు అని చెప్పుకొచ్చారు. కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపారు, ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు. టీడీపీ మూడోతరం నాయకుడుగా ముందుకొచ్చారని మనసులోని మాట బయటపెట్టారు.
పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారని, వారి కోరిక మేరకు డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తే బాగుంటుందన్నారు. భవిష్యత్‌లో పార్టీ యువతకు భరోసా ఇచ్చేందుకు ముందుగా పదవి ఇవ్వాలని తెలియజేశారు. మొత్తానికి నేతలైతే మనసులోని మాట బయటపెడుతున్నారు. ఇంతకూ అధినేత మనసులో ఏముందో ఎవరికి ఎరుక?